దొంగనోట్లు పంచిన టీడీపీ!
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికల్లో అందల మెక్కడం కోసం తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు చివరి క్షణంలోనూ కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కేందు కు వెనకాడటం లేదు. చివరకు ఓటర్లకు దొంగనోట్లు పంచిపెడుతున్నారు. కోట్లా ది రూపాయల్ని వెదజల్లుతున్న టీడీపీ అభ్యర్థులకు అంత సొమ్ము ఎక్కడిదని ప్రజలంతా ఆశ్చర్యపోతున్న నేపథ్యంలో దొంగనోట్ల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో టీడీపీ పంచిన నోట్లు నకిలీవని తేలాయి. వాటిని మార్చేందుకు ప్రయత్నించిన కొందరు ఓటర్ల కు అవి దొంగ నోట్లని తెలియడంతో అవాక్కయ్యారు. ఆ నోట్లతో పోలీసులకు దొరికితే తమ పరిస్థితి ఏమిటని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
నోట్లు ఇమ్మని తాము అడగలేదని, బలవంతంగా చేతిలో పెట్టేసి పోతున్నారని.. తీరాచూస్తే అవి దొంగనోట్లని వాపోతున్నారు. నిడదవోలు టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు పంచిన డబ్బులో నకిలీ నోట్లు ఉన్నట్లు ఓటర్లు గుర్తించారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో దొంగనోట్లు పంచి నట్టు తెలుస్తోంది. నిడదవోలు పట్టణంతోపాటు శెట్టిపేట, జీడిగుంట, పెరవలి మండలం పిట్టల వేమవరం, తీపర్రు, ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం, పసలపూడి తదితర గ్రామాల్లో టీడీపీ దొంగనోట్లు పంచినట్లు ఓటర్లు చెబుతున్నారు. ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంగా డబ్బు పంపకాలు సాగాయి. కొందరు ఓటర్లు అక్కడికి వెళ్లి నకిలీ నోట్లు పంచినవారిని నిలదీయగా శేషారావు సోదరుడు వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ఓటర్లు భయపడుతున్నారు. తాము చెప్పినట్లు తెలిస్తే చంపేస్తారంటూ వణికిపోతున్నారు.
తెగిపడిన నోట్ల కట్టలు
ఏలూరులో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దాదాపుగా తమ ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు. అయినా ఆశ చావక డబ్బు వెదజల్లుతున్నారు. ఓటుకు రూ.300 చొప్పున పంచిపెట్టారు. ఆచంటలో టీడీపీ అభ్యర్థి రూ.700 చొప్పున ఇచ్చారు. భీమవరంలో టీడీపీ అభ్యర్ధి రూ.వెరుు్య చొప్పున డబ్బులు విసురుతున్నారు. కొవ్వూరు, గోపాలపురంలో ఓటుకు రూ.300 ఇస్తున్నారు. నరసాపురంలో టీడీపీ రూ.500, చీర పంచుతోంది. నిడదవోలులో రూ.600 చొప్పున టీడీపీ అభ్యర్థి ఇచ్చారు. ఉండిలో నోటుతోపాటు చీర కూడా సమర్పించారు. పాలకొల్లులో టీడీపీ రూ.500, టీడీపీ రెబెల్ అభ్యర్థి రూ.300 చొప్పున ఓటుకు ముట్టజెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో బీజేపీ అభ్యర్థి ఓటుకు రూ.700 పంచారు. తణుకులో టీడీపీ అభ్యర్థి ఓటుకు రూ.800 ఖర్చు చేస్తున్నారు. ఉంగుటూరులో టీడీపీ అభ్యర్థి రూ.500 చొప్పున ఓటరు చేతిలో పెడుతున్నారు. పోలవరంలో రూ.200, చింతలపూడిలో రూ.300 లెక్కన టీడీపీ అభ్యర్ధులు రేటు కట్టారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి రూ.800 చొప్పున విడదీశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం, దానితో పొత్తు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తున్నారు. నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే పదవి కోసం వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
మద్యం ప్రవాహం
ఓటుకు నోటుతో పాటు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటుకి ఓ క్యార్టర్ బాటిల్ చొప్పున ఇస్తున్నారు. కొందరైతే దాదాపు 20 రోజులుగా నిత్యం మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అందిస్తూ కొందరిని తమ వెంట తిప్పుకున్నారు. ముఖ్యంగా యువకుల్లో కొందరిని మద్యానికి బానిసలుగా మార్చారు. కుల సంఘాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఆ కులం ఓట్లు తమకే పడాలంటూ హుకుం జారీచేశారు. చర్చి ఫాదర్లను, ఆర్‌ఎంపీ డాక్టర్లను కూడా డబ్బుతో లోబరుచుకుని తమకు ఓటేయాల్సిందిగా వారి వద్దకు వచ్చే వారిని ప్రోత్సహించమన్నారు. ఇంత చేసినా.. జనాన్ని డబ్బు, మద్యంతో ఏమార్చలేకపోతున్నామని బాధపడిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఓటరు మహాశయులు తీసుకున్న నిర్ణయంతో టీడీపీ అభ్యర్థులు ఓటమి భయం వణికిపోతున్నారు.