చేతిలో సైకిల్!
కేఈ, కాటసానిలకు రాజకీయ క్షోభ
- చక్రం తిప్పిన వలస నేత
- మద్దతిచ్చిన ఆ సామాజిక వర్గం నాయకుడు
- టీడీపీ ఎంపీ టికెట్ ఆశించిన ప్రభాకర్‌కు భంగపాటు
- బీజేపీ, టీడీపీలకు దూరమైన రాంభూపాల్‌రెడ్డి
- గుణపాఠం చెప్పేందుకు ఇరువురి నిర్ణయం?
సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీలో కాంగ్రెస్ నేతల పెత్తనం మితిమీరుతోంది. వలస నేతలకే ఆ పార్టీ అధినేత పెద్దపీట వేస్తున్నారు. రాబోవు రోజుల్లో పార్టీలో చక్రం తిప్పేందుకు అందివచ్చిన అవకాశాన్ని వారు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఆధిపత్య పోరులో కొత్తగా పార్టీలో చేరిన నేత చక్రం తిప్పడంతో ఇరువురు నేతల భవిష్యత్ తలకిందులైంది.
విధిలేని పరిస్థితుల్లో వీరిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగాను, మరొకరు సైకిల్ గుర్తు కలిగిన సమాజ్‌వాది పార్టీ తరఫున బరిలో నిలవాల్సిన పరిస్థితి తలెత్తింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ టికెట్ ఆశించి.. విషయాన్ని పలుమార్లు అధినేత చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్లారు.
దాదాపు ఖరారైందనుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఓ బడా నేత తన ఆర్థిక బలంతో అడ్డుపుల్ల వేశారు. కేఈ కుటుంబ పెత్తనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో.. పార్టీలోని తన సామాజిక వర్గానికి చెందిన మరో ముఖ్య నేత సహకారంతో తనదైన శైలిలో రాజకీయ డ్రామాకు తెరతీశారు. కేఈ ప్రభాకర్‌ను రెచ్చగొట్టి.. రచ్చ చేయించి మొదటికే మోసం తీసుకొచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
‘మొదటి నుంచి కర్నూలు పార్లమెంట్ ఆశిస్తుంది మీరే కదా? మధ్యలో డాక్టర్ పార్థసారథికి ఎలా ఇస్తారు? ఈ విషయాన్ని మీరు నిలదీయండి’ అని ఆయన సన్నిహితుల ద్వారా అధినేత వద్ద రచ్చ చేసేలా ఉసిగొల్పినట్లు సమాచారం. ఫలితం.. కర్నూలులో చంద్రబాబు సభా వేదికపై వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథిపై దాడికి కారణమైందని తెలుస్తోంది. ఆ గొడవే కేఈ ప్రభాకర్‌ను ఎంపీ టికెట్‌కు దూరం చేయడంతో.. తమ పాచిక పారినందుకు ఆ ఇరువురు నేతలు సంబరాలు చేసుకున్నట్లు వినికిడి.
‘కాటసాని’ సెగ
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి టీడీపీలో చేరాలని భావించారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే కర్నూలు కార్పొరేషనలో సగం వార్డులు పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు పరిధిలో ఉండటం.. తమ ఆధిపత్యానికి కాటసాని ఎక్కడ గండి కొడతారోనని ఆ ఇరువురు నాయకుల్లో ఆందోళన మొదలైంది.
అసలు ఆయనను పార్టీలోకే రాకుండా అడ్డుకోవడం ఉత్తమమని భావించారు. ఆ దిశగా వారి పన్నాగం ఫలించింది. చివర్లో ఆయన బీజేపీలో చేరి పాణ్యం నుంచే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కమలదళం కూడా కాటసాని ఇంట్లో సంప్రదింపులు జరిపింది. విషయం తెలిసిన ఆ ఇరువురు నేతలు ఆయనను బీజేపీకీ దూరం చేశారనే ప్రచారం ఉంది. తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన ఆ ఇద్దరికీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు కేఈ ప్రభాకర్, కాటసాని తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.