ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలు జిల్లాల్లో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలు జిల్లాల్లో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయినిపల్లెలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడగా, ఒక స్కార్పియో వాహనం ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా నల్లగొండ జిల్లాలోనూ ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారితీసింది. చందంపేట మండలం కంబంపల్లి గ్రామంలో టిడిపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ప్రచారం చేసుకుంటూ వస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరికి ఒకరు ఎదురుపడటంతో పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలు రాళ్లురువ్వుకున్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అలాగే మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం అనంతపురంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్త జమీల్పై కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డలితో దాడి చేశారు. దాంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.