బాబు ఆటలో.. ఓడింది ‘తమ్ముళ్లే’ | TDP leaders failed in Chandrababu naidu political game | Sakshi
Sakshi News home page

బాబు ఆటలో.. ఓడింది ‘తమ్ముళ్లే’

Published Fri, Apr 11 2014 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

TDP leaders failed in Chandrababu naidu political game

* నిజం తెలుసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
* కష్టకాలంలో అండగా ఉన్నవాళ్లకు మొండిచెయ్యే!
* పార్టీ మారి ఎమ్మెల్యేలైన వారెందరో!
* దశాబ్దాలుగా సేవలకే పరిమిత మైన నేతలు
* అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... బాబు అంతే
* పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే వారికి గుర్తింపు కరువు.. అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి

 
నమ్ముకుంటే మట్టే : ‘తమ్ముళ్లూ... మీరే నాకు ప్రాణం. ఇప్పటికీ నేను ఇలా నిలబడ్డానంటే అదంతా మీ రెక్కల కష్టమే. దెబ్బలు తిన్నారు.. ప్రాణాలిచ్చారు. 30ఏళ్లుగా నా కోసం అన్నీ త్యాగం చేశారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఇన్నేళ్లూ నా వెంట ఉన్నారు. ఈ ఒక్కసారి అన్నీ వదులుకొని పని చేయండి. ఆ తర్వాత మీ సంగతి చూస్తా’ అని ఊదరగొట్టడం చంద్రబాబు నైజం. కానీ, ఇవన్నీ బూటకపు మాటలే!
 
పోలంపల్లి ఆంజనేయులు: రాజకీయాల్లో విశ్వసనీయత తప్పనిసరి. ప్రజలు, పార్టీ కార్యకర్తలు నాయకుడిని నమ్మాలి. అలా నమ్ముకున్న వారికి నేనున్నాననే ధైర్యం చెబుతూ అండగా నిలిచిన వాడే నిజమైన ప్రజా  నాయకుడు.  తెలుగుదేశం పార్టీలో ఆ విశ్వసనీయతే  కొరవడింది. పార్టీ అధినేత చంద్రబాబు మీద ప్రజలకే కాదు... పార్టీ నాయకులకు సైతం నమ్మకం పోయింది.  30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని, మంచి కాలం రాకపోతుందా..? అన్న ఆశతో సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటూ సేవ చేస్తున్న నాయకులకు ఈసారి టికెట్ల కేటాయింపు తర్వాత పూర్తిగా విశ్వాసం పోయింది.
 
  అందుకే ఇంతకాలం భుజాన మోస్తున్న పార్టీ జెండాను, కండువాలను పారేసి బాధతో పక్కకు తప్పుకుంటున్నారు. వీరిలో నూనూగు మీసాల యువకులుగా పార్టీలో చేరి వృద్ధులుగా మారిన వారు కొందరైతే...  ఇతర పార్టీల్లో చేరే ఓపిక కూడా లేక ట్రస్ట్‌భవన్‌కే అంకితమైన వారు కొందరు. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులను పంపిణీ చేయని  చంద్రబాబు... అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని  తెలిసీ.. టిక్కెట్లు రాని వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని చెపుతుంటే నవ్వుకుంటున్నారు.  
 
 వీరంతా సేవలకే పరిమితమా..?
 ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెళ్లగానే... రిసెప్షన్ పక్కనున్న కార్యాలయంలో వికలాంగుడైన సీని యర్ నాయకుడు పి. సాయిబాబా కనిపిస్తారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడిగా తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన నాయకుడాయన. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వికలాంగుల కార్పొరేషన్, హస్తకళల అభివద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. కానీ చంద్రబాబు ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు.  మరో వికలాంగుడైన నాయకుడు జి. కోటేశ్వరరావు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎక్కడికివెళ్లినా వారి వాహనాల ముందు కోటేశ్వర్‌రావు మూడు చక్రాల స్కూటర్ పచ్చజెండాతో సాగాల్సిందే.
 
 ఆయనకు పార్టీ పరంగా చంద్రబాబు చేసిందేమీ లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన ముమ్మనేని అమర్‌నాథ్ బాబు  ఎన్టీఆర్‌తో, చంద్రబాబుతో సన్నిహితుడిగా వ్యవహరించేవారు. ఈసారైనా బోధన్ నుంచి టిక్కెట్టు ఇస్తారని ఆశించిన ఆయనకు చంద్రబాబు చెయ్యిచ్చారు. మరోనేత మోహన్‌రెడ్డిది ఇదే దుస్థితి. కాంగ్రెస్ నేతగా చిరపరిచితుడైన పీఎల్ శ్రీనివాస్ దశాబ్దం క్రితం టీడీపీలో చేరి  సనత్‌నగర్ టికెట్ ఆశిస్తున్నా అవకాశం రాలేదు. చంద్రబాబు సమకాలీకుడూ, సన్నిహితుడూ అయిన కొమ్మినేని వికాస్ సనత్‌నగర్, కూకట్‌పల్లి టిక్కెట్టు కోసం ప్రయత్నించినా  ఫలితం లేక మిన్నకుండి పోయారు. నల్గొండ జిల్లా నాయకుడు భూపాల్‌రెడ్డిని పార్టీ వదిలేసింది. మునుగోడు ఇన్‌చార్జి కర్నాటి వెంకటేశం,  హుజూర్‌నగర్‌లో చావా కిరణ్మయి, మిర్యాలగూడ నిరంజన్‌రెడ్డి, నల్గొండ బోయిపల్లి కృష్ణారెడ్డి ఈ కోవలోకే వస్తారు.
 
పార్టీ మారితేనే రాజకీయ ఎదుగుదలా..?
 పదేళ్ల క్రితమే కళ్లు తెరిచిన టీఆర్‌ఎస్ వంటి పార్టీల్లోకి వెళ్లిన కొప్పుల ఈశ్వర్ లాంటి వారు ఎమ్మెల్యేలయ్యారు. దీంతో కొందరు నేతలు ఆలస్యంగా కళ్లు తెరుస్తున్నారు.  పచ్చజెండా పక్కన పడేసి గులాబీ కండువాను కప్పుకుంటున్నారు. ముషీరాబాద్ నేత ముఠా గోపాల్, గోషామహల్ నాయకుడు ప్రేంకుమార్ ధూత్ గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
 
ఈ తరం నేతలకు సైతం ఇదే అనుభవం!
 రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సి. కృష్ణాయాదవ్‌పై నకిలీ స్టాంపుల కుంభకోణం కేసు కొట్టేసిన అనంతరం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. అంబర్‌పేట నుంచి టిక్కెట్ ఆశించినా చంద్రబాబు ఇవ్వలేదు.
 -    పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్న కాగజ్‌నగర్‌కు చెందిన గుల్లపల్లి బుచ్చిలింగంను చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో రెబెల్‌గా బరిలో దిగారు.
 -    కరీంనగర్ జిల్లాలో రామగుండం ఇంచార్జీగా సేవలందించిన గోపు అయిలయ్య యాదవ్‌ను ఎన్నికల ముందు మార్చి పెద్దిరెడ్డిని నియమించారు. దీంతో   అయిలయ్య పార్టీకి రాజీనామా చేశారు. హుస్నాబాద్ ఇంచార్జీగా ఉన్న విద్యాసంస్థల అధిపతి పి. రవీందర్‌రావు పదేళ్లుగా పార్టీ బరువును మోశారు. తీరా ఈ స్థానాలను బిజేపికి కేటాయించారు.  
 -    చాలా కాలంగా మహబూబ్‌నగర్ శాసనసభ టికెట్‌ను ఆశిస్తున్న ఎం.పి.వెంకటేష్‌కు ఈ సారీ మొండిచేయే చూపారు. ఈ స్థానాన్ని బిజేపికి వదిలేశారు.
 -    ఎన్టీఆర్ హయాంలో శాప్ చైర్మన్‌గా పనిచేసిన పి.ఆర్. మోహన్ పార్టీ సేవకే పరిమితమయ్యారు.
 -    మీకోసం యాత్రను ముందుండి నడిపించిన ఎల్.దీపక్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వంటి యువ నాయకులను చంద్రబాబు పట్టించుకోలేదు.
 -    బోసా వేణుగోపాల్ యాదవ్, నన్నూరి నర్సిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ వంటి వారు తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్నప్పుడు టీడీపీ జెండా పట్టుకొని గట్టిగా పనిచేశారు. వీరు ఆశించిన  స్థానాలను బీజేపీకి అప్పగించారు.
 -    ఎల్బీనగర్ నుంచి కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి ఎప్పటినుంచో టికెట్‌ను ఆశించి పని చేయగా,   వారిని కాదని కృష్ణయ్యను తెర పైకి తేవడంతో  రెబెల్స్‌గా పోటీకి సిద్ధమయ్యారు.
 -    ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడు మదార్ సాహెబ్ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా టిక్కెట్టు ఇవ్వలేదు.
 -    1985లోనే అప్పటి యువ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్ధన్ రెడ్డిపై టీడీపీ తరుపున పోటీ చేసి 60 వేల ఓట్లు సంపాదించిన ఎం. నారాయణస్వామి, సుధాకర్ గౌడ్, చార్మినార్‌కి చెందిన వెంకట్రాములు గౌడ్ కనుమరుగయ్యారు.
 -    1994లో ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే మధుసూధనరావును అ తర్వాత బాబు పట్టించుకోలేదు. ఈసారి ఆ స్థానాన్ని బిజేపికి ఇచ్చారు. దీంతో మధుసూదనరావు కమలం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 -    వరంగల్ జిల్లా భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు చివరి నిమిషంలో బిజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. ఇల్లెందులో వూకె అబ్బయ్యకు అవకాశం రాక ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు కూడా చివరి క్షణం వరకు టీడీపీ  టికెట్‌ను ఆశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement