కడప రూరల్/అర్బన్, న్యూస్‌లైన్ : ‘‘రేయ్....నువ్వెంత అంటే నువ్వెంత...ఒకరిపై మరొకరు చెప్పుల దాడి....తర్వాత పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషణలు... చివరకు గదిలో నిర్బంధించడం, ఒకరినొకరు తన్నుకోవడం ..ఇవన్నీ ఏ మందుబాబులో, వీధి రౌడీలో చేశారనుకుంటే పొరపాటే. కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాలకృష్ణయాదవ్, ఎమ్మెల్యే బరిలో ఉన్న దుర్గాప్రసాద్‌తోపాటు టీడీపీలో కీలక నేతగా ఉన్న శశికుమార్ మధ్య జరిగిన తగువులాట. బుధవారం అమీన్‌పీర్ దర్గా వద్దగల అమీన్ ఫంక్షన్ హాలు ఎదురుగా టీడీపీ నేతలు భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి పార్టీలోని ముఖ్య నేతలతోపాటు కార్యకర్తలను ఆహ్వానించారు. అయితే స్థానిక నాయకుడైన శశికుమార్‌ను విస్మరించారు. దీంతో చిర్రెత్తిన శశికుమార్ అక్కడికి వెళ్లి టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘నా ఏరియాలో సమావేశం ఏర్పాటు చేసి నన్నే పిలవరా పార్టీ మీ సొత్తా’ అని తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో బాలకృష్ణయాదవ్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో శశికుమార్, బాలకృష్ణయాదవ్‌ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరి దూషించుకునే వరకు వెళ్లింది. అంతటితో ఆగక పరస్పరం చెప్పుల దాడి చేసుకున్నారు.
తుపాకులు తీసేంతవరకూ వెళ్లిన తగువు
బాలకృష్ణయాదవ్, శశికుమార్ చెప్పులతో కొట్టుకున్నప్పుడు స్థానికులు విడిపించే ప్రయత్నం చేశారు. శశికుమార్‌వర్గీయులు బాలకృష్ణయాదవ్‌ను ఒక గదిలో నిర్బంధించారు. ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. శశికుమార్, బాలకృష్ణయాదవ్‌లను ఒకే గదిలో ఉంచి చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కూడా పరిస్థితి చేయిదాటి ఒకరినొకరు దూషించుకోవడంతోపాటు ఇద్దరూ తుపాకులు తీశారు. దీంతో బెంబేలెత్తిన టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయాలేదని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసశర్మ తెలిపారు.
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
Published Thu, May 1 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement
Advertisement