గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు మీద వేటు వేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు మీద వేటు వేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రంలోగా తాను బరి నుంచి తప్పుకుని అధికారిక అభ్యర్థి జ్యోత్స్నలతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే వేటు తప్పదని పార్టీ నాయకత్వం ఆయన్ను హెచ్చరించింది. గూడూరులో బల్లి దుర్గాప్రసాదరావు ఓడిపోతారనే అంచనాతో పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిఫారసుతో కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలతను టీడీపీ రంగంలోకి దించింది.
తనకు టికెట్ నిరాకరించడంతో దుర్గాప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, పార్టీ అధినేత బుజ్జగిం చినా అయితే నాకేంటి అనేలా వ్యవహరించడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారని తెలిసింది. తాను పిలిచినా డోంట్ కేర్ అనేలా వ్యవహరించడం పార్టీలో మిగిలిన వారికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయిందని ఆయన జిల్లా నాయకులతో వాపోయినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంలోగా పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని పార్టీ హై కమాండ్ జిల్లా నాయకుల ద్వారా దుర్గాప్రసాద్‌కు అల్టిమే టం ఇచ్చినట్లు సమాచారం. గడువులోగా ఆయన సానుకూలంగా స్పందించకపోతే శనివారం అతని మీద సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, బహిష్కరించినా కూడా వెనక్కు తగ్గరాదని దుర్గాప్రసాద్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.