బీజేపీతో పొత్తుకోసం టీడీపీ విశ్వప్రయత్నాలు
ఢిల్లీ: బీజేపీతో పొత్తుకోసం టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రానున్నసార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టు కోవడంలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీలో గుబులు మొదలైంది. ఎలాగైనా బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే మంచిదని టీడీపీ నేతలు భావిస్తుండటంతో ఆ పార్టీల మధ్య పొత్తు అంశం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే మరోమారు టీడీపీ నేతలు బీజేపీ అధినాయకత్వానికి తమ అభ్యర్థనలను వెల్లడించారు. తమ పార్టీ పొత్తు పెట్టుకునే విషయమై మరికొంత సమయం ఇవ్వాలని వారు బీజేపీ పెద్దలకు విన్నవించారు. ఈసారి ఎటువంటి పొత్తు లేకుండా ఎన్నికలకు సిద్ధమయ్యే బీజేపీ ప్రకటనను మరో 24 గంటలు వాయిదా వేసుకోవాలని టీడీపీ నాయకులు ప్రాదేయపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ కోరిన సీట్లు ఇస్తామని టీడీపీ పేర్కొంది. దీంతో కాస్త దిగివచ్చిన బీజేపీ ఒంటరి పోరు ప్రకటనను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబులతో చర్చించాకే తుది ప్రకటన చేస్తామని బీజేపీ అగ్ర నాయకత్వం తెలిపింది.
తెలంగాణ బీజేపీ నాయకులు పొత్తుకు విముఖత వ్యక్తం చేస్తున్నా.. పొత్తు లేనట్టేనని బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రకటించినా.. టీడీపీ మాత్రం వెంపర్లాడుతోంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఇంకా ప్రయత్నిస్తోంది. బీజేపీ డిమాండ్లకు టీడీపీ తలొగ్గుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌కు టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. పొత్తుపై అవకాశాలు తోసిపుచ్చవద్దంటూ విన్నవిస్తున్నారు.