టీఆర్‌ఎస్ శంఖారావం 12న
ఎస్సారార్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్:పుష్కర కాలానికి ముందు టీఆర్‌ఎస్ ఆవిర్భావసభ జరిగిన స్థలం నుంచే తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా అంతే ప్రధానమనే ఎజెండాతోనే కేసీఆర్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. అందుకే తనకు అన్ని విధాలుగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచి, అదే ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం సభ జరగాల్సి ఉండగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటం వల్ల వాయిదా వేశారు. రెండో విడత పోలింగ్ 11వ తేదీతో ముగుస్తుండగా, ఆ మరుసటి రోజు బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ జిల్లా ఇన్‌చార్జి బోయిన్‌పల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి సోమవారం సభ తేదీని వెల్లడించారు. నగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 12వ తేదీ సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణం ప్రధాన అస్త్రంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కేసీఆర్, సింహగర్జన సెంటిమెంట్‌లో భాగంగానే ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ నిర్వహించేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. 2001లో టీఆర్‌ఎస్ ఏర్పాటు అనంతరం ఇదే మైదానంలో సింహగర్జన పేరుతో ఆవిర్భావసభ జరిగింది. ఊహించని స్థాయిలో ఆ సభ విజయవంతం కావడంతో అక్కడినుంచి టీఆర్‌ఎస్ వెనుదిరగలేదు. అందుకే మరోసారి అదే సెంటిమెంట్‌తో పునర్నిర్మాణం పేరుతో తొలి బహిరంగసభను ఇక్కడే నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు. నియోజకవర్గానికి ఇరవై వేల మంది చొప్పున లక్షన్నర మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.