
ఇప్పుడున్నది తెలుగు కాంగ్రెస్: విజయచందర్
ప్రస్తుతం రాష్ట్రంలో అసలు టీడీపీయే లేదని, ఇప్పుడున్నది తెలుగు కాంగ్రెస్ అని వెఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు టి.ఎస్.విజయ్‌చందర్ ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం, తుని: ప్రస్తుతం రాష్ట్రంలో అసలు టీడీపీయే లేదని, ఇప్పుడున్నది తెలుగు కాంగ్రెస్ అని వెఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు టి.ఎస్.విజయ్‌చందర్ ఎద్దేవా చేశారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కాంగ్రెస్ పార్టీలున్నాయని, జాతీయ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, సోనియా అహంకారానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అభివర్ణించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అన్ని పార్టీలు ఒక వైపు ఉండి సమైక్యాంధ్ర కోసం పోరాడిన జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నాయని చెప్పారు. చంద్రబాబు మనసంతా హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపైనే ఉందని, సీమాంధ్ర అంటే ఆయనకు విద్వేషమన్నారు.
రాష్ట్ర విభజనతో తెలుగువారిన విచ్ఛినం చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే తెలుగు జాతికి ద్రోహం చేయడమే అవుతుందని విజయచందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబునాయుడు అదే పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ముఖ్యనేతలను టీడీపీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజల హృదయాల నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. తండ్రిలా సులక్షణాలు కలిగిన జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు.