సాక్షి ప్రతినిధి, కడప: ఓవైపు అత్తెసరు ప్రజాదరణ, మరోవైపు కాషాయ నేతలతో చెలిమి, ఇంకోవైపు వలస నేతల అలక దరువు వెరసి తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. వర్గ రాజకీయాల కారణంగా పోటీ ఇవ్వగలమని భావించిన తెలుగుతమ్ముళ్లు నైరాశ్యంలోకి వెళ్లారు. ఎన్నికలు సమీపించే కొద్దీ చంద్రబాబు జిమ్మిక్కులు విఫలం అవుతుండడమే ఇందుకు కారణం.
రాజకీయంగా కాలం చెల్లిన నాయకులను చేర్చుకుని లేని సమస్యలను తీసుకువస్తున్నారని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయిస్తూ నాలుగు జాబితాలు విడుదల చేసినా ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డి పేరు లేకపోవడాన్ని ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసిన నేతలను కాదని వలసలను ప్రోత్సహించి లేని భారాన్ని కొని తెచ్చుకున్నారని ఆపార్టీ సీనియర్ నేతలు మదనపడుతున్నారు.
గుదిబండగా మారిన పొత్తు...
రాజకీయంగా ఈమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు బీజేపీ పొత్తు శాపంగా పరిగణించిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇరువురి మైత్రిలో భాగంగా కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుకుంది. కడప సీటు కోసం మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరించారు. అయితే కడప సీటును బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి.
దీంతో పాటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులకు బీజేపీతో పొత్తు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఎంతో కొంత పోటీ ఇవ్వగలమనే భావనలో ఉన్న ఆయా ప్రాంతాల నేతలకు ముస్లిం, క్రిష్టియన్ ఓట్లను కోల్పోవలసి వస్తుందనే ఆవేదన అధికమైంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసే స్థితిలో ఆయా వర్గాలు ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకొస్తున్నారు.
వలస నేతల అలకలు....
పార్టీ టికెట్ దక్కుతుందని ఆశిస్తే రిక్తహస్తం చూపుతున్నట్లు వలస నేతలు అలకపాన్పులపైకి చేరారు. ఐదుమార్లు వరుసగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా 2009లో ఓటమి చెందారు. ఈమారు మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని గ్రహించి తెలుగుదేశం చెంతన చేరారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అభయంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నా నిష్ర్పయోజనం అవుతోంది.
ప్రొద్దుటూరు సీటును మాజీ ఎమ్మెల్యే వరదకు కట్టబెట్టాలని మరో వలస నేత వీరశివారెడ్డి కూడా కోరుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి రాయచోటిలో ఉత్పన్నమైతే మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి టీడీపీ నేతలను బెదిరించి సీటు దక్కించుకున్నట్లు సమాచారం. ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి రాయచోటి టికెట్‌ను తమ కుటుంబానికి కేటాయించకపోతే తాను ఎంపీగా పోటీ చేయనని అల్టిమేటం జారీ చేయడంతో తలొగ్గినట్లు తెలుస్తోంది.
రెల్వేకోడూరు సీటుపై పీటముడి....
రైల్వేకోడూరు టీడీపీ అభ్యర్థిత్వంపై పీటముడి నెలకొంది. గతంలో అజయ్‌బాబుతో రెండు సార్లు పోటీ చేయించి అతని వద్ద కాసుల గలగలలు తగ్గాయని తాజాగా డాక్టర్ వెంకటసుబ్బయ్య పేరును ప్రకటించారు. అంతలోనే మళ్లీ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేత తాను సూచించిన వ్యక్తికి టికెట్ అప్పగిస్తే మద్దతిస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఆమేరకు రిటైర్డ్ ఉద్యోగి సుబ్బరామయ్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్‌బాబును కాదన్న టీడీపీ కొత్తగా మరో అభ్యర్థిని బరిలో దించి, అంతలోనే వెనక్కి తగ్గడాన్ని తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
దిగాలులో తమ్ముళ్లు!
Published Thu, Apr 17 2014 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement