
మాజీల ఎదురీత
ప్రత్యర్థుల నుంచి మాజీ మంత్రులకు తీవ్రమైన పోటీ
పక్క నియోజకవర్గాల్లోకి తొంగి చూడకుండా ప్రచారంలో తలమునకలు
మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌కు సొంత పార్టీ నుంచే సహాయ నిరాకరణ!
గెలుపు కోసం చెమటోడుస్తున్న డీఎస్, జానా, పొన్నాల, }ధర్‌బాబు, ఉత్తమ్, అరుణ, గీతారెడ్డి
కె.యాదగిరిరెడ్డి
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష తామే నేరవేర్చామని కాంగ్రెస్ పార్టీ ఎంతగా మొత్తుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే అంటూ ఆ పార్టీ నేతలంతా ఢంకా బజారుుస్తున్నా ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రులు టీఆర్‌ఎస్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఆంధోల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంథనిలో శ్రీధర్‌బాబు, బోధన్‌లో సుదర్శన్‌రెడ్డిలు తవు ప్రత్యర్థుల కంటే వెనుకబడినట్టే కనిపిస్తోంది. జనగామలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరో మాజీ మంత్రి బసవరాజు సారయ్య గెలుపు కోసం చెమటోడ్సాలిన పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో పడరాని పాట్లు పడుతున్నారు. గద్వాలలో డీకే ఆరుణ, జహీరాబాద్‌లో గీతారెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
నియోజకవర్గాలు దాటని మంత్రులు
తెలంగాణ జిల్లాల్లో తాజా మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. కనీసం పక్క స్థానాల్లోకి కూడా తొంగిచూసే పరిస్థితి కూడా లేదంటూ పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉండి జిల్లా రాజకీయాలను శాసించిన ఈ నేతలు తీరా ఎన్నికలు వచ్చాక ఇతర నియోజకవర్గాల ఊసెత్తకపోవడం పార్టీ కేడర్‌ను నిస్తేజానికి గురి చేస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్, పొన్నాల, ఉత్తమ్‌కుమార్ తమ నియోజకవర్గాలకే పరిమితమవడం గమనార్హం.
జానా కోటలో నువ్వా.. నేనా..
తెలంగాణలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ (చలకుర్తి) నుంచి టీడీపీ తరపున రెండుస్లారు, కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడోసారి రేసులో ఉన్న జానాకు ఈ ఎన్నికల్లో గట్టెక్కడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక్కడ్నుంచి చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కొందరు నేతలను అభివృద్ది పథంలోకి తీసుకురావడం తప్పితే నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మండలానికి ఒక్కరో ఇద్దరో నాయకులను ఎంపిక చేసుకుని వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడం, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలు, ప్రజలను పట్టించుకోకపోవడంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సీపీఎంలో సుదీర్ఘకాలం పనిచేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సిం హయ్య టీఆర్‌ఎస్ తరఫున ఇక్కడ్నుంచి బరిలో దిగారు. తెలంగాణ సెంటిమెంట్‌తోపాటు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న తన సామాజికవర్గం ఓట్లను రాబట్టుకునేందుకు నోముల ప్రయత్నిస్తున్నారు. జానారెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.
దామోదరకు ఇంటిపోరు..
తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లా ఆంధోల్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి సినీ హాస్య నటుడు బాబూమోహన్ ఈసారి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కంటే దామోదర్‌పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు బాబూమోహన్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం లోపాయికారిగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్న వైనం దామోదర్‌కు ఆందోళన కలిగిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనేక సందర్భాల్లో ఆయన కుటుంబంపై విరుచుకుపడిన తీరును ఓ సామాజికవర్గం గుర్తుచేసుకుని దామోదర్‌పై ఆగ్రహంతో ఉంది
అరుణ, గీతారెడ్డిలకు గట్టి పోటీ
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో డీకే ఆరుణ తన సమీప బంధువు, టీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. జహీరాబాద్‌లో గీతారెడ్డి కూడా గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
జనగామలో పొన్నాల ఎదురీత..
వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి గట్టి పోటీకి తోడు పొన్నాలపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతల్లో ఎక్కువ మంది పొన్నాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. పొన్నాలను గెలిపిస్తే సీఎం అవుతారనే ప్రచారం కాంగ్రెస్‌కు కొంత మేలు చేస్తున్నా.. మంత్రిగా ఉన్నప్పుడే అందుబాటులో లేడు.. ఇక ముఖ్యమంత్రి అయితే అసలే అందుబాటులో ఉండరనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
శ్రీధర్‌కు ముచ్చెమటలు..
కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గడచిన సాధారణ ఎన్నికల్లోనూ వీరిద్దరూ తీవ్రస్థాయిలో పోటీ పడ్డా శ్రీధర్‌బాబును విజయం వరించింది. మధు ఈసారి టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలవడంతో మంత్రి ఎదురీదుతున్నారు. 2009తో పోలిస్తే పోటీ తీవ్రత బాగా పెరిగిపోయింది.
ఉత్తమ్‌కు దూరమైన కేడర్
మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నుంచి బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్టీ కేడర్‌కు దూరంగా ఉండడం, జిల్లా కాం గ్రెస్‌లోని ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటం, టీఆర్‌ఎస్ నుంచి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బరిలో ఉండడం వల్ల ఉత్తమ్ గెలుపు అంత సులువు కాదని పరిశీ లకులు అంటున్నారు.
సారయ్యకు అష్టకష్టాలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బస్వరాజు సారయ్య గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉండటం, టీఆర్‌ఎస్ నుంచి కొండా సురేఖ తలపడుతుండటంతో పోటీ తీవ్రస్థాయిలో సాగుతోంది. ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 1999 నుంచి గెలుస్తూ వస్తున్న సారయ్యపై నియోజకవర్గం ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.