ఓటర్ల జాబితాలో తొలగింపులు జరిగినప్పటికీ సమస్యలు తలెత్తడం అనివార్యమని ప్రధాన ఎన్నికల అధికారి నితిన్ గడ్రే పేర్కొన్నారు.
ముంబై: ఓటర్ల జాబితాలో తొలగింపులు జరిగినప్పటికీ సమస్యలు తలెత్తడం అనివార్యమని ప్రధాన ఎన్నికల అధికారి నితిన్ గడ్రే పేర్కొన్నారు. ఇందుకు కారణం తప్పుల సవరణకు పటిష్టమైన వ్యవస్థ లేకపోవడమేనన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘తొలగింపు ప్రక్రియ 2013, ఆగస్టులోనే పూర్తయింది. దాదాపు 50 లక్షల మంది ఓటర్లను జాబితాను తొలగించాం. దీనిపై ఎంతో ప్రచారం కూడా చేశాం. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు సంబంధించి కొంత సమయం కూడా కేటాయించాం. అన్ని రాజకీయ పార్టీలకు సీడీలు కూడా ఇచ్చాం. తొలగించిన జాబితాను వెబ్‌సైట్‌లో కూడా ఉంచాం.
ప్రతిపాదిత తొలగింపుల జాబితాను ఆన్ని రాజకీయపార్టీలకూ అందజేశాం. తొలగింపుల విషయంలో ఎటువంటి రహస్యమూ లేదు’ అని అన్నారు. కాగా పుణేలో అనేకమంది ఓటర్లు తమ పేర్లు లేవంటూ ఫిర్యాదు చేయడమే కాకుండా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇటీవల ఆందోళనకు దిగిన సంగతి విదితమే. ఈ విషయమై ఆయన స్పందిస్తూ ఆగస్టు తర్వాత కొత్తగా 40 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరారన్నారు. 2014, జనవరిలో 16 లక్షలు, మార్చిలో 6.8 లక్షల మంది చేరారన్నారు. ఇలా మొత్తం 56 లక్షల మంది కొత్త ఓటర్ల జాబితాలో చేరారన్నారు. ఇందులో 23 లక్షలమంది తాజా ఓటర్లు ఉన్నారన్నారు.
పుణేలో మొత్తం 6.22 లక్షలమంది పేర్లను తొలగించామని, ఇందులో 1,400 మంది మాత్రమే తమకు ఫిర్యాదు చేశారన్నారు. వాస్తవానికి ఆ 1,400 మంది పేర్లు పొరపాటున తొలగింపునకు గురయ్యాయని ఆయన వివరణ ఇచ్చారు. ముంబైలో 6.5 లక్షలమంది పేర్లు తొలగింపునకు గురయ్యాయని, అయితే ఒక్క ఫిర్యాదు కూడా తమకు ఇప్పటిదాకా అందలేదన్నారు. ఓటర్లు అప్రమత్తమై తప్పులను సవరిం చుకోవాలని సూచించారు.