బొగ్గు ఉత్పత్తిపై ఎన్నికల ప్రభావం
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలు, సా ర్వత్రిక ఎన్నికల ప్రభావం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మణుగూరు మినహా ఇతర ఏరియాలు గత నెలలో నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, 30న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిర్వహించిన గేట్ మీటింగ్‌లు, ప్రచారంలో కొందరు కార్మికులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సంస్థ వ్యాప్తంగా 40,34,000 టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా 23,72,542 టన్నులు(59 శాతం) మాత్రమే నమోదైంది. కొత్తగూడెంలో 59 శాతం, ఇల్లెందులో 60, మణుగూరులో 106, రామగుండం-3లో 93, అడ్రియాలలో 35, భూపాలపల్లిలో 27, రామగుండం-1లో 61, రామ గుండం-2లో 33, బెల్లంపల్లిలో 13, మందమర్రిలో 30, శ్రీరాంపూర్‌లో 93 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది.
భూపాలపల్లిలో..
భూపాలపల్లి ఏరియాలో 3,03,700 టన్నులకు 82,440 టన్నుల(27 శాతం) ఉత్పత్తి జరిగింది. కేటీకే-1 గనిలో 41వేల టన్నులకు 22,286 టన్నులు, కేటీకే-2లో 34,200 టన్నులకు 17,110 టన్నులు, కేటీకే-5లో 41వేల టన్నులకు 19,313 టన్నులు, కేటీకే-6లో 23,900 టన్నులకు 13,804 టన్నులు, కేఎల్‌పీలో 13,592 టన్నులకు 5,285 టన్నులు, ఓపెన్‌కాస్ట్‌లో 1,50,000 టన్నులకు 4,643 టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఏరియాలోని భూగర్భ గనులలో 1,53,692 టన్నులకు 77,797 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.