కోట్ల, కేఈ కుటుంబాల రహస్య ఒప్పందం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: హోదా పెరిగే కొద్దీ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. ఆ నేతలు మాత్రం ఇందుకు అతీతం. ఒకప్పటి ఆదరణను అడ్డంగా పెట్టుకొని మరొకరిని ఎదగనీయకుండా సాగిస్తున్న స్వార్థ రాజకీయం నవ్వులపాలవుతోంది. పేరుకు పార్టీలు వేరైనా.. తెరవెనుక కలిసి నడుస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఈ రెండు కుటుంబాలను తాజా ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. సొంత నియోజకవర్గంలోనే ఓట్లు పడని పరిస్థితుల్లో ఇరువురూ పక్క నియోజకవర్గాల్లో బరిలో నిలిచినా ఆపసోపాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరికొకరు పార్టీలకు అతీతంగా సహకరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చర్చ జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మ.. కేఈ సోదరులకు చావోరేవో అన్నట్లు తయారయ్యాయి. కర్నూలు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈయనను గెలిపించే బాధ్యతను కేఈ కుటుంబం భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కోట్ల సుజాతమ్మ గెలుపు బాధ్యత కూడా వీరే తీసుకున్నట్లు ‘పచ్చ’ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రతిగా పత్తికొండలో కేఈ కృష్ణమూర్తికి.. డోన్‌లో కేఈ ప్రతాప్ గెలుపునకు కోట్ల కుటుంబం హామీ ఇచ్చినట్లు సమాచారం. సొంత పార్టీ అభ్యర్థులను బలిపశువులను చేస్తూ ఈ రెండు కుటుంబాలు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఓడిపోయేందుకు గాను ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులకు ప్యాకేజీలు ముట్టజెప్పినట్లు వినికిడి. కోట్ల వర్గం డోన్, పత్తికొండలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతుండగా.. ఈ రెండు ప్రాంతాల్లో కేఈ వర్గం ఎంపీ ఓటు కాంగ్రెస్‌కు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కర్నూలులో చిత్రమైన పొత్తు కుదిరింది. ఇక్కడ టీడీపీ తరఫున పోటీలోని టీజీ అంటే ఆ రెండు కుటుంబాలకు సరిపడని పరిస్థితి. టీజీ ఓటమే ధ్యేయంగా కులమతాలను రెచ్చగొడుతూ ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులతోనే నామినేషన్లు వేయించడం గమనార్హం. గొడవలు చెలరేగిన వెంటనే ఇరు వర్గాలను పిలిపించుకుని ఓట్లను చీల్చేలా పథకం రచించినట్లు చర్చ ఉంది. అదేవిధంగా వైఎస్‌ఆర్‌సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓ వర్గం ఓట్లను చీల్చేందుకూ కుట్ర చేసినట్లు సమాచారం.
పెద్ద మనుషులు.. చిన్న బుద్ధులు
Published Sun, May 4 2014 3:26 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement