అరచేతిలో వైకుంఠం
ప్రచారం : ‘నా హయాంలో అనంతపురం మున్సిపాల్టీని బాగా అభివృద్ధి చేశాను.. నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు నగరాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాను. ఈ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి’
- ఇదీ అనంతపురం అర్బన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రచారం తీరు.
జరిగింది ఇదీ : నిధుల వేట పేరుతో జేబు నింపుకునే కార్యక్రమం చేపట్టారని నాటి నుంచి నేటి వరకు ఊరంతా కోడైకూస్తోంది. నగర నడిబొడ్డులోని విలువైన స్థలాలను కారు చౌకగా అమ్మేసి మున్సిపాల్టీని నిరుపేదగా మార్చారు. తద్వారా ఆయన మాత్రం కోటీశ్వరుడయ్యారనే విమర్శలున్నాయి.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మామూలుగా ప్రతి ఒక్కరూ స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భూములు, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన కష్టాలు పీకల మీదకు వస్తే తప్ప... చిన్నపాటి ఇబ్బందులకు స్థిరాస్తులను అమ్ముకోరు. అప్పోసప్పో చేసి వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఇలానే చేస్తారు. అదే మనది కాదు అనుకున్నప్పుడు ‘పోతే ఏమిటి... మనకొచ్చే నష్టం ఏమిటి’ అన్న ఆలోచన కనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనే అనంతపురం మున్సిపాల్టీ మాజీ చైర్మన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి నేతృత్వంలోని కౌన్సిల్‌కు వచ్చింది. 1995-2000 మధ్య మున్సిపల్ చైర్మన్‌గా ప్రభాకర్ చౌదరి పని చేశారు. ఆ సమయంలో మున్సిపాల్టీకి సంబంధించి నగరంలోని అత్యంత విలువైన స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్ర యించేశారు. అప్పట్లో ఈ స్థలాలపై స్థానికులకు అవగాహన లేకపోవడం, పెద్ద విలువైనవిగా భావించకపోవడంతో చౌదరి తనదైన శైలిలో వ్యవహారం నడిపించి లబ్ధిపొందారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తంతు మున్సిపాల్టీని స్థిరాస్తి లేని నిరుపేదగా మార్చేసింది. మునిసిపల్ (డీ రిజర్వుడు) ఓపెన్ స్థలాలను విక్రయించవచ్చని 1996లో అప్పటి ప్రభుత్వం ఒక జీవో 419 జారీ చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రభాకర్ చౌదరి నేతృత్వంలోని అప్పటి పాలకవర్గం యథేచ్చగా నగరంలో 27 ప్రాంతాలో అత్యంత విలువైన 5 ఎకరాలు (501.705 సెంట్లు) అమ్మేశారు.
తద్వారా సంస్థకు నగదు రూపంలో రూ.1,26,54,074 వచ్చింది. ఆ స్థలాలే ఇపుడు ఉండింటే వాటి విలువ ఎంతో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అమ్మేసిన ప్రతి స్థలం ఇప్పటి ధరల ప్రకారం సెంటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు.. ఆ పైనే ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం ఆ స్థలాల విలువ దాదాపు రూ.50-100 కోట్ల మధ్య ఉంటుందని పలువురు సిబ్బందే చెబుతున్నారు. ఇదే జీవో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు వర్తిస్తుంది. అయితే అప్పట్లో అనంతపురం పురపాలక సంఘం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క మునిసిపాలిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున డీ రిజర్వుడు స్థలాలను అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ప్రభాకర్ చౌదరి ఆ పని చేసి ఉండకపోయింటే నేడు అనంతపురం మరింత అభివృద్ధి సాధించి ఉండేదనడంలో సందేహం లేదు.
పరిరక్షణ చేత కాదనడం అసమర్థత
సంస్థ స్థలాలు అన్యాక్రాంతం అవుతాయని ఎవరైనా చెబితే అది సరైన సమాధానం కాదు. మన సొంత ఆస్తులను ఎలా కాపాడుకుంటామో అదే విధంగా సంస్థ ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ జావాబుదారీగా ఉండాలి. పరిరక్షించడం కష్టమనో లేక చేతకాదని చెబితే అది అసమర్థత కిందకే వస్తుంది. అధికారులు అమ్మారని కొందరు చెప్పుకొస్తుంటారు. స్థానిక సంస్థల్లో అధికారుల పాత్ర చాలా తక్కువ. ఏదైనా సరే కౌన్సిల్ నిర్ణయం మేరకే జరగాల్సి ఉంటుంది. అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకోవడమంటూ జరగదు. అలా ఏ అధికారైనా తీసుకుంటే అతనికి చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ నిర్ణయమైన కౌన్సిల్ తీర్మానం ద్వారానే జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.