
మోడీ గాలి లేదు: జోషి
న్యూఢిల్లీ: సొంత పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న జోషి గుజరాత్ నమూనా అభివృద్ధి అన్ని రాష్ట్రాలకూ సరిపడదన్నారు.
ఒక రాష్ట్రానికి చెందిన అభివృద్ధి నమూనాను తాను ప్రోత్సహించబోనని, వివిధ రాష్ట్రాల్లోని మంచి అంశాలను తీసుకుని అభివృద్ధి నమూనాను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్రమోడీ కోసం తన వారణాసి స్థానాన్ని మురళీ మనోహర్ జోషి వదులుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మనోరమా న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జోషి తాజా వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.