నెల్లూరుకు కొత్తగా ఎవరైనా వెళ్తే ఏసీ మార్కెట్ అనే పేరు విన్నప్పుడు ఒకింత వింతగా అనిపిస్తుంది. కూరగాయల మార్కెట్ కూడా ఏసీ చేశారా అనుకుంటారు. కానీ, ఆనం కుటుంబంలో తొలి తరం నాయకుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి) పేరు మీద వచ్చిన మార్కెట్ అని ఆ తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఈయన ఆనం కుటుంబంలో మూడోతరం నాయకుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు.
ఇప్పటికే వివేకా చిన్న కొడుకు రంగ మయూర్ రెడ్డి కార్పొరేషన్కు పోటీచేశారు. తాజాగా ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. నెల్లూరు సిటీ స్థానాన్ని తనకు గానీ, తన కొడుకు సుబ్బారెడ్డికి గానీ ఇవ్వాలని ఇటీవల జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని ఆనం వివేకా కోరారు. దీనికి పార్టీ అధిష్ఠానం కూడా దాదాపు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సన్నాహకంగా మాజీ మంత్రి రామనారాయణరెడ్డి ఇంట్లో ఓ సమావేశం జరిగింది. అక్కడే ఏసీ సుబ్బారెడ్డి రాజకీయ ప్రవేశం విషయాన్ని స్థానిక నాయకులందరితో ఆనం సోదరులు చర్చించినట్లు తెలిసింది.
అయితే, కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధనను కచ్చితంగా అమలుచేస్తే, ఆనం కుటుంబంలో ఇప్పటికే ఉన్న ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలలో ఒకళ్లకే టికెట్ దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో సిటింగ్ ఎమ్మెల్యేలు. మరి ఆనం కుటుంబం నుంచి ఈసారి ఎంతమందికి టికెట్లు ఇస్తారో చూడాల్సి ఉంది.
క్రియాశీల రాజకీయాల్లోకి ఏసీ
Published Thu, Apr 10 2014 11:42 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement