ఆనం వారి ఫ్యామిలీ ప్యాకేజి
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల వరకు ఓ నిబంధన పెట్టుకుందని చెబుతున్నారు. ఒక కుటుంబలో ఒకరికే టికెట్ ఇస్తామని చెప్పారు. ఆ నిబంధన వల్ల చాలామంది సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపలేకపోయారు. కొంతమందయితే వారసుల కోసం తాము త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే, కొంతమందికి వర్తించిన ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయలేదు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం ఏకంగా ఫ్యామిలీ ప్యాకేజి తీసేసుకుంది. ఒక కుటుంబంలో రెండు టికెట్లు రావడమే కష్టం అనుకుంటే ఆనం కుటుంబం నుంచి ముగ్గురు ఈసారి అదే జిల్లా నుంచి ఎమ్మెల్యే స్థానాలకు పోటీ పడుతున్నారు.
ఆనం కుటుంబ పెద్ద, మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఆత్మకూరు నుంచే బరిలో దిగుతున్నారు. వాస్తవానికి ఆయన ఈ స్థానంలో పోటీ చేయాలా వద్దా అనే ఊగిసలాటలో కొన్నాళ్లు ఉన్నా, చివరకు అదే స్థానాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడూ చిత్ర విచిత్రాలు చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోను, బయట కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉండే ఆనం వివేకానందరెడ్డి ఈసారి పోటీ చేయట్లేదు. తనకు బదులుగా ఆయన తన పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి)ని రంగంలోకి దించుతున్నారు. ఈయన నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దాదాపుగా ఖరారు చేసిన జాబితాలో కూడా ఏసీ సుబ్బారెడ్డి పేరు ఉంది. ఇక ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయకుమార్ రెడ్డి ఈసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ స్థానం ఆనం కుటుంబానికి ఎప్పటి నుంచో బాగా తెలిసుండటం, దాదాపు అన్ని గ్రామాల్లో తమకు పట్టు ఉండటంతో విజయకుమార్ రెడ్డిని అక్కడినుంచి దింపాలని ఆనం బ్రదర్స్ నిర్ణయించినట్లు తెలిసింది.
ఇలా ఆనం కుటుంబం నుంచే నెల్లూరు జిల్లాలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అలాగే, నల్లగొండ జిల్లాలో కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డికి, ఆయన భార్య పద్మావతికి కూడా టికెట్లు ఇచ్చేశారు. ఈ మినహాయింపును సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకు లభించలేదు. సీనియర్ నాయకుడు పాల్వాయ గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతికి టికెట్ నిరాకరించడంతో ఆమె రెబెల్గా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఇలా ఒక్కొక్కళ్లకు ఒక్కో రూల్ పెట్టి కాంగ్రెస్ పెద్దలు తమ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు.