నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ ఆదివారం జరగనుంది. సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ డివిజన్ల పరిధిలో ఎంపీటీసీ 473, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎంపీటీసీ 14 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 459 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడత పోరులో మొత్తం 11,94,433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5,96,704, మహిళలు 5,97,729 మంది ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఈ ఎన్నికలకు 3,292 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్త్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరుస్తారు.
ఎన్నికలకు భారీ బందోబస్తు..
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తొలి విడత ఎన్నికలకు పోలీస్ శాఖ నుంచి 4 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గానికి ఒక డీఎస్పీ, మండలానికి ఒక ఇన్‌స్పెక్టర్, మిగతా ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. జిల్లాస్థాయిలో ఎస్పీ, అదనపు ఎస్పీలు పనిచేస్తారు. సమస్యాత్మకంగా గుర్తించిన 825 గ్రామాల్లో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్సు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.
వీరితో పాటు ఈ ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 247 మంది మైక్రో అబ్జర్వర్స్‌ను నియమించారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన వారు. ఈ గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ సరళిని రికార్డు చేస్తారు.
బ్యాలెట్ పత్రం తెలుపు - గులాబీ
పార్టీల సింబల్‌తో జరుగుతున్న ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు ఉన్న బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. రెండింటిని కూడా ఒకే బ్యాలెట్ బాక్సులో వేయాలి. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు ఆయా కేంద్రాల్లో క్యూలో ఉన్నట్లయితే వారికి ఓటు వేసేందుకు వీలుంటుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయాన్ని మాత్రమే 6 గంటలకు పొడిగించారు.
నేడే తొలి పోరు
Published Sun, Apr 6 2014 12:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement