సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజైన బుధవారం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గాల వారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు, నామినేషన్ సెట్ల సంఖ్యపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వలేకపోయింది. సమాచార శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు రాగా, చివరి రోజే 53 దాఖలయ్యాయి. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 269 నామినేషన్లు రాగా ఒక్క బుధవారమే 178 దాఖలయ్యాయి.
మెదక్, జహీరాబాద్ లోక్‌సభలకు పోటాపోటీ
మెదక్ లోక్‌సభ స్థానానికి 15 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు బుధవారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పి. ప్రభుగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి టి. శ్రావణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌లతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. ఇక జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి చివరి రోజు 12 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, టీఆర్‌ఎస్ అభ్యర్థి భీంరావు పాటిల్, ఆప్ అభ్యర్థి సునీల్ కుమార్ వెనిగల్ల, బీఎస్పీ అభ్యర్థి ఫరీదుద్దీన్‌తో పాటు ఏడు మంది స్వతంత్రులు ఉన్నారు. దాఖలైన నామినేషన్లను గురువారం సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది.
అసెంబ్లీల నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లు..
సిద్దిపేట
సిద్దిపేట అసెంబ్లీకి మొత్తం 26 మంది 54 సెట్ల నామినేషన్లు వేయగా, చివరి రోజే 15 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ తరఫున పడక జగదీశ్వర్, కాాంగ్రెస్ తరఫున తల్లూరి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ తరఫున సీహెచ్ విద్యా సాగర్, టీడీపీ తరఫున మెరుగు మల్లేషం చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ రెబల్ చొప్పదండి చంద్రశేఖర్ కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
మెదక్
మెదక్ అసెంబ్లీ స్థానానికి.. 15 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి రోజే 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున అల్లారాం క్రీస్తుదాస్, టీడీపీ తరఫున భట్టి జగపతి, గడిల శ్రీనివాస్‌రెడ్డిలు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
అందోల్
అందోల్ అసెంబ్లీ స్థానానికి 10 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు వేయగా.. ఒక్క చివరి రోజే 8 మంది అభ్యర్థులు 12 సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, వైఎస్సార్ సీపీ తరఫున సంజీవరావు, టీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి పి.బాబూమోహన్, బీజేపీ తరఫున బుర్రె ఎల్లయ్య, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బి.మొగులయ్యలు చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
దుబ్బాక
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు రాగా.. చివరి రోజు 8 మంది అభ్యర్థులు 8 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున ఎం. శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి ఎం రఘునందన్ రావు, బీఎస్పీ నుంచి రాచకట్ల లక్ష్మి, టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బి. రవికుమార్ నామినేషన్ వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మూడు రోజుల కిందే నామినేషన్లు దాఖలు చేయగా..ఆయన బి-ఫారం అందలేదు.
గజ్వేల్
గ జ్వేల్ అసెంబ్లీ స్థానానికి 10 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్‌ల దాఖలుకు చివరి రోజైన బుధవారమే 9 మంది అభ్యర్థులు 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, వైఎస్సార్‌సీపీ తరఫున డి. పురుషోత్తం రెడ్డి, టీడీపీ తరఫున ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రెబల్ అభ్యర్థిగా ఆకుల నరేశ్‌బాబులు బుధవారం నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
నర్సాపూర్
నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థుల నుంచి 30 సెట్ల నామినేషన్లు రాగా..చివరి రోజే 13 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్ వేశారు. వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ బస్వానందం, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సునీతా రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి తిరుమల మదన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థులు .. చాగండ్ల బల్వీందర్, సింగాయిపల్లి గోపిలు రెండు బీ-ఫారంలు ఇచ్చారు. సీపీఎం తరఫున లక్ష్మీభాయి, మల్లేషం, జై సమైక్యాంధ్ర పార్టీతరఫున మహమ్మద్ మాజీద్ అలీ, బీఎస్పీ నుంచి శాంత కుమార్‌లు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
పటాన్‌చెరు
పటాన్‌చెరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 28 మంది అభ్యర్థుల నుంచి 42 సెట్ల నామినేషన్లు రాగా.. చివరి రోజే 20 మంది అభ్యర్థులు 22 సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే టి.నందీశ్వర్ గౌడ్, వైఎస్సార్ సీపీ తరఫున గురుజాల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున గూడెం మహిపాల్ రెడ్డి, బీజేపీ తరఫున సి. అంజిరెడ్డి, ఎంఐఎం తరఫున సయ్యద్ రెహ్మత్‌లు చివరి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
సంగారెడ్డి
సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా..చివరి రోజే 26 మంది అభ్యర్థులు 40 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే టి. జయప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున చింతా ప్రభాకర్, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ చివరి రోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
జహీరాబాద్
జహీరాబాద్ అసెంబ్లీ స్థానానికి 19 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లు వేయగా.. చివరి రోజు 14 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జె. గీతారెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున నల్లా సూర్యప్రకాశ్‌రావు, టీడీపీ తరపున వై.నరోత్తం, టీఆర్‌ఎస్ తరఫున మాణిక్ రావులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
నారాయణ్‌ఖేడ్
నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు వేయగా..చివరి రోజు 7 మంది 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి, వైఎస్సార్ సీపీ తరఫున అప్పారావు షెట్కార్, టీఆర్‌ఎస్ తరఫున ఎం. భూపాల్ రెడ్డి చివరిరోజు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
నామినేషన్లకు తెర
Published Wed, Apr 9 2014 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement