రాజకీయాలలో ఏం జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరంలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు,సీట్లే ముఖ్యంగా ఉంటాయి.
హైదరాబాద్: రాజకీయాలలో ఏం జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరంలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు,సీట్లే ముఖ్యంగా ఉంటాయి. ఎన్నికలు సమీపించే కొద్ది వాటి బండారం బయటపడుతూ ఉంటుంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చివరి వరకు చెప్పలేని పరిస్థితి. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు గతంలో ప్రకటించారు. ఆ తరువాత విలీనం ఊసేలేదు. పొత్తు అన్నారు. పొత్తు లేదన్నారు. ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో టిఆర్ఎస్ ఉంది.
నిన్నటి వరకు బిజెపితో పొత్తుకు టిడిపి వెంపర్లాడింది. సీట్ల కేటాయింపు దగ్గర ఆ రెండు పార్టీలకు చెడింది.బిజెపి అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి టిడిసి సుముఖంగాలేదు. దాంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు సందిగ్ధంలో పడింది. పొత్తు విషయమై బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు టిడిపికి 24 గంటల డెడ్లైన విధించారు.
టీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్లో చేరుతున్నారు. టిఆర్ఎస్ నేతలు ఎంపి వివేక్, వినోద్లు రేపు కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ నేపధ్యంలో బిజెపితో పొత్తుకు టిఆర్ఎస్ సిద్ధపడింది. ఆ పార్టీతో చర్చలు జరపాలన్న ఆలోచనతో ఉంది. పార్టీ ముఖ్యనేతలు, జెఏసి నేతలతో ఈ విషయమై కెసిఆర్ చర్చలు జరుపుతున్నారు. బిజెపి పొత్తుకు సిద్దపడితే ఆ పార్టీకి 25 శాసనసభా స్థానాలు, మూడు లోక్సభ స్థానాలు ఇవ్వడానికి టిఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.