వైఎస్సార్ సీపీ బలోపేతం | vinukonda constituency very strong YSR Congress Party says :Ayodhya Rami Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ బలోపేతం

Published Thu, Apr 3 2014 4:39 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

వైఎస్సార్ సీపీ బలోపేతం - Sakshi

వైఎస్సార్ సీపీ బలోపేతం

వినుకొండ, న్యూస్‌లైన్ :వినుకొండ నియోజవకర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ విజయం దిశగా ముందుకు సాగుతున్నామని ఆ పార్టీ నరసరావుపేట లోక్‌సబ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని లాయర్ స్ట్రీట్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నియోజవర్గాలను మరింతగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. 
 
 వినుకొండ నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు ఉన్నందున మరికొంత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఒత్తిళ్లకు గురికావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్టీ మరింత పురోగతి సాధించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్న తనకు సమన్వయకర్త డాక్టర్ సుధకు మధ్య విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. తమ పార్టీ గోల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించడం ఒక్కటేనన్నారు. పార్టీ క్యాడర్, పబ్లిక్‌కు ఎలాంటి గందరగోళం లేదని డాక్టర్ సుధ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
 చిన్న చిన్న ఒత్తిళ్లను అధిగమించి ముందుకు వెళ్తామన్నారు. సమన్వయకర్త డాక్టర్ సుధ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి సారథ్యంలో పనిచేస్తామని తెలిపారు. తండ్రిలా భావిస్తున్న అయోధ్యరామిరెడ్డి సలహా లు, సూచనలతో రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి పనిచేస్తామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తిచేశారు.సమావేశంలో ఆళ్ళ పేరిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కన్వీనర్‌లు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement