
ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు తెలిసేలా ప్రచారం: భన్వర్‌లాల్
ఓటర్లందరికీ పోలింగ్ కేంద్రాలు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, వారికి పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ఆదేశించారు.
సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్లందరికీ పోలింగ్ కేంద్రాలు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, వారికి పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ఆదేశించారు. పోలింగ్ రోజున ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీమాంధ్ర జిల్లాల్లో 7వ తేదీన పోలింగ్ ఏర్పాట్లపై ఆయన జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలు అందుబాటు తదితర అంశాలను సమీక్షించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎటువంటి ప్రచారం జరక్కుండా చర్యలు తీసుకోవాలని, మద్యం, డబ్బు పంపిణీలపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు.