
కలిస్తేనే విజయం
టీడీపీ, బీజేపీ శ్రేణులకు వెంకయ్య సూచన
హైదరాబాద్: ఇద్దరం కలిస్తేనే రాష్ట్రంలో విజయం సాధిస్తామన్న విషయాన్ని టీడీపీ, బీజేపీల నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు సూచించారు. రెండు పార్టీల శ్రేణులు రానున్న రోజుల్లో మరింత సఖ్యతగా మెలగాల్సిన అవసరముందన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి కె.లక్ష్మణ్ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పొత్తుల కారణంగా సీటు కోల్పోతే ఏ పార్టీకైనా, నాయకుడికైనా బాధ ఉండడం సహజమని.. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు తమ కూటమే గెలుచుకుంటుందని.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో బీజేపీ-టీడీపీ ప్రభుత్వాలే వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో తమ కూటమికే స్పష్టమైన అధిక్యత ఉందని.. తెలంగాణలో ఇప్పుడు ముక్కోణపు పోటీ జరుగుతున్నప్పటికీ 20వ తేదీ తరువాత మార్పులు చోటుచేసుకొని తమ కూటమి విజయం సాధించే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఓటమి భయం, అభద్రతాభావంతో కొందరు తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాటికి ప్రజలే బదులిస్తారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని తాము ప్రయత్నం చేయడం లేదని, తమ కూటమిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు.