వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ ఖాయం
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి
సత్తెనపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సత్తెనపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ 175స్థానాల్లో 140 ఎమ్మెల్యే సీట్లతోపాటు, మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించబోతోందని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్ని కుట్ర లు, కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మోడి అనే పువ్వును తీసుకొచ్చి సీమాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వు పెట్టాలని చూస్తున్నారని, అది కూడా ప్రజలు గమనించారన్నారు. వారి పప్పులు ఉడకపోవడంతో సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు, పవన్ అన్నదమ్ములిద్దరూ రూ.100 కోట్లకు పార్టీని అమ్మేసుకున్న ఘనులని విమర్శించారు. ప్రజారాజ్యం పేరుతో తమ సామాజికవర్గాన్ని వారు ముంచేశారన్నారు. వైఎస్సార్ సీపీ సీమాంధ్రలో కాపులకు 32 ఎమ్మెల్యే టికెట్లతో పాటు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించి సముచిత స్థానం కల్పించిందని అంబటి పేర్కొన్నారు.