చంద్రబాబు నిక్కర్లు వేసుకునేసరికే ఐటీలో మనం టాప్
చంద్రబాబు నాయుడు నిక్కర్లు వేసుకునే సమయంలోనే ఐటీ రంగంలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని తానే తీసుకొచ్చానన్నట్లు చెబుతున్న చంద్రబాబు తీరును ఆమె ఎండగట్టారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన వైఎస్ జనపథం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాబు హయాంలో పెన్షన్‌దారుడు ఒకరు చనిపోతేనే మరొకరి పెన్షన్ వచ్చేదని, అలాంటిది ఇప్పుడు మాత్రం ఆయన ఎన్నికల వేళ రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 9 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయని చంద్రబాబు ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటున్నారని మండిపడ్డారు. రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే తన హయాంలో రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. వెన్నుపోటుకు మారుపేరైన చంద్రబాబుకు వైఎస్ఆర్‌ను విమర్శించే అర్హత లేదని, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని, కేసులను ఎదుర్కొనే దమ్ములేక స్టే తెచ్చుకున్నారని ఆమె అన్నారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని వేశారని, ఆయనే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ఉంటే విభజన జరిగేది కాదని వైఎస్ విజయమ్మ అన్నారు. భర్తను పోగొట్టుకున్న బాధ ఓ వైపు, ప్రజలు కష్టాల సుడిగుండంలో ఉన్నారన్న వేదన మరోవైపు తనను తీవ్రంగా కలచివేశాయని వైఎస్ విజయమ్మ చెప్పారు. అప్పట్లో వైఎస్ఆర్ చూపించిన పట్టుదల అంతా ఇప్పుడు వైఎస్ జగన్‌లో కనిపిస్తోందని ఆమె అన్నారు.
సమైక్యాంధ్ర అనలేని పరికిపంద చంద్రబాబు అని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వనీతే విభజనకు కారణమని, నయవంచకుడైన చంద్రబాబును నమ్మితే మరోసారి ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. వైఎస్ జగన్ వల్లే వైఎస్ఆర్ ఆశయాల సాధన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.