‘రాజ’సం ఎవరిదో?
‘మోడీ’గాలి గట్టెక్కించగలదని బీజేపీ ధీమా
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోని కాంగ్రెస్
ప్రస్తుతం బీజేపీకి మంచి పట్టున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. సాధారణంగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదాహరణకు 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాలకు గానూ 96 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఆ తర్వాతి సంవత్సరం 2009 లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని బీజేపీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమనే ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తంచేస్తున్నారు.
ఎలక్షన్ సెల్
‘మోడీ’గాలి వీస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ రాజస్థాన్‌లో అత్యధిక స్థానాలను సాధించగలమని బీజేపీ ధీమాగా దూసుకుపోతోంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ప్రచారం సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి కాంగ్రెస్ వర్గాలు ఇంకా తేరుకోకపోవడం కూడా బీజేపీకి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వసుంధర రాజేకు గల రాచకుటుంబ వారసత్వ నేపథ్యమూ బీజేపీకి సానుకూలాంశమే. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటికే మూడొంతుల స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఈనెల 24న పోలింగ్ జరగనుంది. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 20 స్థానాలను గెలుచుకుంది. అయితే, ఈసారి పరిస్థితి తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
‘కాషాయ’దళంలో ఉత్సాహం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం రాష్ట్రంపై బాగా ప్రభావం చూపుతుండటంతో రాజస్థాన్‌లోని బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యమంత్రి వసుంధర రాజేకు పార్టీపై గల పట్టు కూడా బీజేపీకి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుని రికార్డు బద్దలు కొట్టాలని ‘కమల’నాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలకు చాన్నాళ్ల ముందే ప్రణాళికలను సిద్ధంచేసిన సీఎం వసుంధర పార్టీ శ్రేణులను, ‘సంఘ్’ శక్తులను సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. అన్ని స్థానాలకూ ఇన్‌చార్జిలను, రాష్ట్రస్థాయిలో ప్రచార కమిటీని నియమించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
నీరసించిన ‘చెయ్యి’
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిస్తేజం అలముకుంది. పార్టీ నాయకత్వంలోనూ సమన్వయం కొరవడటం సమస్యగా మారింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏరికోరి మరీ ఎంపిక చేసిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు సీనియర్ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోక్‌సభలో అజ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పైలట్‌ను వారు తమవాడిగా భావించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ ఎంపిక చేసిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో పలువురు సీనియర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేతలు సీపీ జోషీ, డాక్టర్ చంద్రభాన్ తదితరులెవరూ పైలట్‌కు సహకరించకపోవ డంతో కాంగ్రెస్‌కు ఎదురీత తప్పడం లేదు.
పార్టీల బలాబలాలు
బీజేపీ బలాలు..
*అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో పార్టీలో, శ్రేణుల్లో పెరిగిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం.
*ప్రధాని అభ్యర్థి మోడీకి రాష్ట్రంలో ఉన్న ప్రజాదరణ
*ప్రభుత్వంపై, పార్టీపై వసుంధర పట్టు.
*పార్టీ వర్గాలు, ఆరెస్సెస్‌ల సమన్వయం.
సవాళ్లు..
కొన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీలో వర్గ విభేదాలు
కాంగ్రెస్
బలాలు..
సచిన్ పైలట్ రూపంలో కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన ఉత్సాహం.
సవాళ్లు..
*ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీలో, కార్యకర్తల్లో అలముకున్న నిస్తేజం.
*పార్టీలోఅంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు.
*రాష్ట్ర నాయకులతో సచిన్ పైలట్ సమన్వయలోపం. సచిన్ మద్దతిచ్చి, నిలబెట్టిన అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం *పాలవ్వడంతో ఆయన నాయకత్వ సామర్థ్యంపై రాష్ట్ర నేతల్లో అనుమానాలు.
*యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు.