కడప నగరం భగత్‌సింగ్ కాలనీలో మంగళవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఆరు నెలలకే వీరు తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
పరస్పరం ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని కలలు కన్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. చిన్న విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు గొడవకు దారితీశాయి. క్షణికావేశానికి లోనయ్యారు. చస్తానంటూ ఒకరినొకరు బెదిరించుకున్నారు. చివరకు అన్నంతపనీ చేశారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప నగరం భగత్‌సింగ్ కాలనీలో మంగళవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఆరు నెలలకే వీరు తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ బాలమద్దిలేటి కథనం మేరకు.. భగత్‌సింగ్ నగర్‌లో పెంచలయ్య,ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్, విజయకుమార్ అనే కుమారులు, శాంతి అనే కుమార్తె ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్‌కు సుశీల అనే యువతితో వివాహం జరిగింది. వీరిరువురు భగత్‌సింగ్ నగర్‌లోనే వేరు కాపురం ఉంటున్నారు. సుశీల చెల్లెలు నాగజ్యోతి(19) ఇజ్రాయిల్ తమ్ముడు విజయకుమార్(21) పరస్పరం ప్రేమించుకున్నారు. కొంతకాలంగా విజయ్‌కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో విజయకుమార్, నాగజ్యోతిలు ఐటిఐ సర్కిల్‌లోని ఆంజనేయస్వామి దేవాలయంలో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్దే వీరు ఉంటున్నారు.
ఈనెల 21వ తేదీన సోమవారం విజయకుమార్ తల్లి ఆదిలక్ష్మి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ శుభకార్యానికి తన కుమార్తెతో కలిసి వెళ్లింది. మంగళవారం విజయకుమార్ తండ్రి పెంచలయ్య తాను పనిచేసే పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రాగా ఆ సమయంలో విజయకుమార్ మద్యం సేవించి ఇంటికి రావడాన్ని తండ్రి పెంచలయ్య గమనించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పెంచలయ్య డ్యూటీకి వెళ్లిపోయాడు. దీనికి తోడు విజయకుమార్ తన భార్య నాగజ్యోతిని అక్క సుశీల ఇంటికి వెళ్లవద్దని కూడా గొడవ పడేవాడు. ఈ గొడవ పెరిగి ఉరి వేసుకొని చనిపోతామని పరస్పరం బెదిరించుకున్నారు. ఓ గదిలో విజయకుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకోవడాన్ని గమనించిన నాగజ్యోతి భయపడి తన అక్క సుశీలకు ఫోన్‌చేసి చెప్పింది. ఆమె వచ్చేలోపు నాగజ్యోతి కూడా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. స్థానికులు, సుశీల వచ్చి చూసేలోపు భారాభర్తలిద్దరు ఫ్యాన్లకు వేలాడుతున్నారు. కొన ఊపిరితో ఉన్న నాగజ్యోతిని కిందికి దించేలోపు ఆమె కూడా మృతిచెందింది. విజయకుమార్ అన్న ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.