
మోడీ ప్రధానైతే రాజకీయ సన్యాసం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుని, నరేంద్ర మోడీ ప్రధాని అయితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ శపథం చేశారు.
శివమొగ్గ (కర్ణాటక), న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుని, నరేంద్ర మోడీ ప్రధాని అయితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ శపథం చేశారు. శనివారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారని, తనకైతే అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించ లేదని అన్నారు.
‘బీజేపీని గెలిపించండి, దేశాన్ని రక్షించండి’ అని కమలనాథులు చేస్తున్న ప్రకటనలపై ఆయన విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. దేశంలోని సామాన్యులకు సైతం అమెరికా వీసాలు మంజూరు చేస్తుందని, అయితే మోడీకి ఎందుకు నిరాకరించిందని ప్రశ్నించారు. గోధ్రా అల్లర్ల అనంతరం రాజ ధర్మం గురించి మోడీకి వాజ్‌పేయి బోధించారని గుర్తు చేశారు. బీజేపీని ఉన్నత స్థితికి తెచ్చిన ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని మోడీ అవమానించారని ఆరోపించారు.