మహిళలే నిర్ణేతలు
మహిళలే నిర్ణేతలు
Published Sun, Apr 13 2014 2:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా భాగస్వాములవుతున్నారన్న విషయం మరోమారు స్పష్టమైంది. ప్రాదేశిక ఎన్నికల తుది విడత పోలింగులోనూ మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువగా నమోదైంది. పోలైన పురుషులు, మహిళల ఓట్లలో భారీ తేడా ఉండటంతో అభ్యర్థుల జయాపజయాలను వారి ఓట్లే నిర్దేశిస్తాయని భావిస్తున్నారు. జె డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తక్కువ ఓట్లే ఉంటాయి. అందువల్ల కొద్దిపాటి ఓట్ల తేడాలే అభ్యర్థుల తలరాతను మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు ఎక్కువగా పోలవడంతో వారి ఓట్లే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. జిల్లాలో ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలివిడతలో 18 మండలాల్లోనూ, రెండో విడతలో 20 మండలాల్లోనూ జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 7,68, 961 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఎమ్పీటీసీ స్థానాలకు 5,75,773 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 5,52,967 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ రెం డింటిలోనూ మహిళలే అధికసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో 8,87,977 మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఎమ్పీటీసీ స్థానాలకు 6,63,112 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 6,82,262 మంది ఓటు వేశారు. ఈ రెండు విడతల్లోనూ పురుషులు కంటే మహిళల ఓటింగ్ గణాంకాల్లో 5 నుంచి 8 శాతంవరకు అధికంగా ఉంది. ఇంత భారీ వ్యత్యాసం కచ్చితంగా అభ్యర్థుల గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తుందని అం చనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి అదరణ ఉన్నట్లు పోలింగ్ సందర్భంగా స్పష్టం కావడంతో ఈ పరి ణామం ఆ పార్టీ అభ్యర్థులకే అనుకూలం గా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ పార్టీకి మహిళాదరణ తగ్గిపోవడం, పోలింగ్‌లో వారిదే పైచేయిగా ఉండటంతో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement