పులివెందులలో ఓటేసిన జగన్
150 సీట్లు వస్తాయి: భారతి, షర్మిల
పులివెందుల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందుల బాకరాపురంలోని 124 పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్‌ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ తదితరుల కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల, వైఎస్ భారతి తమను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, 150 సీట్లు వస్తాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజలు కూడా ఇతర పార్టీలకు బుద్ధి చెప్పాలని ఎంతో కసిగా ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం ఎవరు పాటుపడతారో వారికే కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఇస్తుందన్నారు.