ఈ సారి ఫ్యాన్‌కే!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నికల ప్రచారంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. తమకు ఓటు వేయాలని వారు అడిగితే....సారీ, ఈసారికి వదిలేయండని ఓటర్ల నుంచి సమాధానం వస్తోంది. వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని ముఖం మీద చెబుతుండడంతో ఆ పార్టీ నేతలు కంగుతింటున్నారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన చూశాం. పింఛను కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఇళ్ల కోసం కాళ్లరిగేలా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రేషన్‌కార్డు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వైద్యమైతే దైవాదీనం. నిత్యం కరువే. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మైక్రో ఫైనాన్స్‌తో ఆడవాళ్లు ప్రాణాలు తీసుకునేవారు’
‘ఐదేళ్ల వైఎస్సార్ పాలన చూశాం. అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చాయి. అడక్కుండానే ఇళ్లు ఇచ్చారు. ఇంటికొచ్చి రేషన్ కార్డులిచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత శస్త్ర చికిత్సలు చేశారు. 108, 104 వాహనాలతో ఆపదలో ఆదుకున్నారు’ ‘వైఎస్సార్ మరణం తర్వాత పాలనా చూశాం. పింఛన్లు సరిగా రావడం లేదు. కొత్తగా ఇళ్లు ఇవ్వలేదు. ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు జరగడం లేదు. కొత్తగా రేషన్‌కార్డులివ్వడం లేదు. 108 వాహనాలు ఫోన్ చేస్తే గంట తర్వాత వస్తున్నాయి. ఈలోపు ప్రాణాలు పోతున్నాయి’. ఇలా వైఎస్సార్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనను విశ్లేషించుకున్న ప్రజలు.... ఎవరికి ఓటు వేయాలన్న దానిపై ఒక నిర్ణయానికొచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగిపోయే సమాధానమిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులను ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ‘చంద్రబాబు పాలన చూశాం. వైఎస్సార్ పాలన చూశాం. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూశాం. ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూస్తాం. అందుకే వైఎస్సార్ సీపీకి మద్డతిస్తా’మంటూ వారి ముఖం మీద చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానం చూసి ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితులు గమనించి డబ్బులు ఎరచూపుతున్నా.. వారి వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది.