'మీకు తోడుగా ఉండేందుకు ఎప్పుడూ సిద్ధం'
ఖమ్మం : ప్రజలకు తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పథకం కింద పిల్లల చదువు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి సంతకం చేస్తారన్నారు. వృద్ధులకు 700, వికలాంగులకు 1000 ఫించన్ ఇచ్చేందుకు రెండోసంతకం, రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుకు మూడో సంతకం చేస్తారన్నారు.
తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు రూ.50 హార్స్ పవర్ని కొనసాగించారా?, కిలో రూ.2 బియ్యం పథకాన్ని కాపాడారా?, రైతుల రుణమాఫీ చేశారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు.