
ఫ్యాన్ గిరగిరా..సైకిల్ గాబరా
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : వ్యాపార, వాణిజ్య రంగంలో జిల్లాలో పేరుగాంచిన గొల్లప్రోలులో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. గొల్లప్రోలు పేరు చెప్పగానే అందరికీ ఉల్లి, మిరప గుర్తుకొస్తాయి. రెండింటి మాదిరిగా ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా ఘాటుగా మారింది. తొలిసారిగా నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. గతంలో రాజకీయ కురువృద్ధుడు పాము సూర్యారావు, మొగలి రామ్మూర్తి, మాదేపల్లి రంగబాబు వంటి వారు ఇక్కడ సర్పంచ్‌గా పనిచేశారు.
సర్పంచ్‌గా ఎప్పుడూ హోరాహోరీ పోరు జరుగుతుండేది. నగర పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.నగర పంచాయతీ తొలి కుర్చీని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు పోటీ పడుతున్నాయి. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. బలగాలను, బంధుత్వాలను, వర్గాలను కూడగొట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ కేడర్ మూడొంతులకు పైగా వైఎస్సార్‌సీపీలో చేరింది. ఇటీవల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో ఆ పార్టీ బలం మరింతగా పుంజుకుంది.
దీంతో పాటు వార్డుల్లో బలమైన అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తెడ్లపు చిన్నాను చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ముందుగా ప్రకటించి స్పష్టమైన వైఖరితో ఎన్నికల గోదాలోకి దిగింది. దీంతో వైఎస్సార్ సీపీ కేడర్ ప్రచారంలో దూసుకుపోతోంది. మరోపక్క టీడీపీ ఇంతవరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. అందుకే ప్రచారంలో వారు కొంత తడబడుతున్నారు. తొలిసారిగా నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.