ఎన్నడూ లేనంతగా ఈసారి ఎక్కువ సంఖ్యలో మహిళలు యు.ఎస్. మధ్యంతర ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ‘మీటూ’ వేళ మహిళావనికి ఇదొక మంగళప్రదమైన సంకేతం. బరిలో నిలిచిన మహిళల ముఖాలు మనమెరిగినవి కాకపోవచ్చు. కానీ ఆ గెలుపోట ముల ముఖకాంతులు.. లోకాలను వెలిగించేవి, పోరాటస్పృహను కలిగించేవీ!
యు.ఎస్.లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మంగళవారమే జరుగుతాయి. మంగళవారమే ఎందుకంటే.. ఏవో హిస్టారికల్ శకునాలు. కొన్ని గంటల్లో ఇవాళ అక్కడ మిడ్‌టెర్మ్ పోల్స్. మధ్యంతర ఎన్నికలు. ముఖం చిట్లించి చూపు తిప్పుకునే విషయమే. ఎవరిక్కావాలి? ఇంటి పక్కన కేసీఆర్ వేసుకున్న ‘ముందస్తు’ షామియానానే ఓ మామూలు విషయం. ఇక ఎక్కడో అమెరికాలోని ‘మిడ్‌టెర్మ్’ పోల్ ఫంక్షన్‌ని ఆగి చూస్తామా! పిల్లలు, స్కూళ్లు, అప్పులు, వడ్డీలు.. ఎన్నున్నాయ్ జీవితంలో. ఎన్నికల్లా ఐదేళ్లకో, రెండేళ్లకో వచ్చిపోయేవి కావివన్నీ. ఎప్పుడూ వెంట ఉండేవీ. వెంబడిస్తూ ఉండేవి. అయితే ఈసారి యు.ఎస్. ఎన్నికల్నుంచి పూర్తిగా ముఖం తిప్పేసుకోలేం. అవేం అధ్యక్ష ఎన్నికలు కాదు. భారీ ముఖాలేం బరిలో లేవు. ప్రపంచం కూడా పెద్దగా నోరు తెరిచి అమెరికా వైపు చూసేదేం ఉండదు. అయినా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ఎన్నికల్లో ఉంది. ఇంట్రెస్టింగ్ కాదు, ఇన్‌స్పైరింగ్ పాయింట్. 257 మంది మహిళలు ఈ మిడ్‌టెర్మ్ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు! రికార్డిది. ఇరవై ఏళ్ల క్రితం ఈ రికార్డు 131. నలభై ఏళ్ల క్రితం 48. ఇదేం విశేషం! ఏళ్లు గడుస్తున్న కొద్దీ పోటీ చేసేవాళ్లు పెరుగుతూనే ఉంటారు కదా. సంఖ్య పెరగడం విశేషం కాదు. సంఖ్యను పెంచుతున్న విశేషం ఏదో ఉంది. ఏంటది? ఈ ఎన్నికల్లోనైతే ‘మీటూ’ ఎఫెక్ట్!అమెరికన్ పార్లమెంట్‌కి (పార్లమెంట్ అనరు. ‘కాంగ్రెస్’ అంటారు) సరిసంఖ్య ఉన్న ప్రతి ఏడాదీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అంటే రెండేళ్లకోసారి. 2016లో జరిగాయి.
అంతకు ముందు 2014లో. ఇప్పుడు 2018లో. తర్వాత 2020లో. అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకోసారి వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అవీ సరిసంఖ్య ఉన్న ఏడాదిలోనే. అవీ మంగళవారమే.మనకిక్కడ పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నట్లే అమెరికన్ ‘కాంగ్రెస్’లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్), పెద్దల సభ (సెనెట్) ఉంటాయి. ఆ రెండు సభలకే ఇప్పుడు ఈ ఎన్నికలు. వాటితో పాటు అమెరికాలోని యాభై రాష్ట్రాల ప్రతినిధుల సభలకు, పెద్దల సభలకు, యాభై గవర్నర్ పదవులకు కలిపి 6,665 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో మొత్తం 435 సీట్లకు, ‘సెనెట్’లోని 100 సీట్లలో 35 సీట్లకు (మూడింట ఒక వంతు) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లే కాబట్టి ప్రతి రెండేళ్లకూ మొత్తం నాలుగు వందల ముప్పై అయిదు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.
సెనెట్ సభ్యుడి పదవీ కాలం ఆరేళ్లు కనుక ప్రతి రెండేళ్లకూ ఖాళీ అయ్యే ముప్పై ఐదు సీట్లకు పోలింగ్ ఉంటుంది. 2016 ఎన్నికల నాటికి యు.ఎస్.లో ‘మీటూ’ ఉద్యమం మొదలవలేదు. గత ఏడాది అక్టోబర్‌లో ఆవిర్భవించింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’కి పోటీ పడుతున్న అభ్యర్థులలో 29 శాతం మంది, సెనెట్‌కు పోటీ చేస్తున్నవారిలో 32 శాతం మంది మహిళలే. ఈ రెండు సభలకు కలిపి 257 మంది మహిళలు బరిలో ఉన్నారు. మనకైదేనా కొత్తది వచ్చిందంటే, అమెరికాలో అది పాతదై ఉంటుంది. ‘మీటూ’ కూడా అంతే. ముందక్కడ. తర్వాత ఇక్కడ. అలాంటిది.. ఒకటేదైనా అమెరికాకే తొలిసారి అయి ఉందంటే? అదెక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అక్కడి మహిళల్నుంచి. ఈ ఎన్నికల్లో క్రిస్టీన్ హాల్‌క్వెస్ట్ గెలిస్తే అమెరికా తొలి ట్రాన్స్‌జెండర్ గవర్నర్ అవుతారు. స్టేసీ అబ్రామ్స్ గెలిస్తే అమెరికా తొలి నల్లజాతి గవర్నర్ అవుతారు. పాలెట్ జోర్డాన్ గెలిస్తే అమెరికా తొలి ‘నేటివ్ అమెరికన్’ (ప్రాచీన దేశవాళీ జాతుల) గవర్నర్ అవుతారు. అలెగ్జాండ్రియా ఆకాసియో కార్టెజ్ (29) గెలిస్తే అమెరికా తొలి యంగెస్ట్ ఉమన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. రషీదా త్లయీబ్ గెలిస్తే అమెరికా తొలి ముస్లిం–అమెరికన్ ఉమన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. ఇల్హాన్ ఒమన్ గెలిస్తే అమెరికా తొలి సోమాలీ–అమెరికన్ ఇన్ ‘కాంగ్రెస్’ అవుతారు. వీళ్లంతా ‘డెమోక్రాట్’ పార్టీ అభ్యర్థులే.
అంటే ‘రిపబ్లికన్ పార్టీ’కి ప్రత్యర్థులు. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు విరోధులు. అలాగని ట్రంప్ పార్టీలో మహిళా అభ్యర్థులు లేరని కాదు. ఆ పార్టీ మహిళలతో ఈ పార్టీ మహిళలు పోటీ పడుతున్నారని కాదు. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న మహిళలు, ‘మీటూ’ను సమర్థిస్తున్న మహిళలు ఈ ఎన్నికల్లో, అందులోనూ డెమోక్రాట్ పార్టీలో ఎక్కువమంది ఉన్నారు. పోటీ పడిన ఈ మహిళలంతా గెలిస్తే ఈ ఎన్నికలు మంగళప్రదం అవుతాయి. అసలు మహిళ పోటీ పడడమే పెద్ద గెలుపు. సామాన్యంగా లేరక్కడ మేల్ షోవెనిస్టులు. పిల్లలు, స్కూళ్లు, అప్పులు, వడ్డీలు.. ఎన్నున్నా జీవితంలో అప్పుడప్పుడు తలెత్తి చూడాలి. ఏ దేశ మహిళైనా విజయం సాధించడం అంటే.. నింగిలో ఒక కొత్త నక్షత్రం మెరవడమే. తలెత్తి చూడడమే కాదు.. పిల్లలకు, పక్కనున్న వాళ్లకూ చూపించాలి. ఆ నక్షత్రకాంతి.. భూమి మీద ఏ దీపాన్ని వెలిగిస్తుందో చెప్పలేం. అందుకే చూపించాలి.
వీరు గెలిస్తే...
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment