మరణానికి కొన్ని నెలల ముందు...
నమో నాస్తికా!
ఆపిల్ కంపెనీ సీఈవో స్టీవ్ జాబ్స్ పాంక్రియాస్ కేన్సర్‌తో చనిపోయేనాటికి ఆయన వయసు యాభై ఆరు. 2011 అక్టోబర్‌లో ఆయన చనిపోయారు. అదే నెలలో ఆయన జీవిత చరిత్ర ‘స్టీవ్ జాబ్స్’ వెలువడింది. గ్రంథకర్త వాల్టర్ ఐజాక్సన్. జాబ్స్‌తో ఐజాక్సన్‌కి చాలా సాన్నిహిత్యం ఉంది. రెండేళ్ల వ్యవధిలో దాదాపు నలభైసార్లు జాబ్స్‌ని ఇంటర్వ్యూ చేశారు ఐజాక్సన్. జాబ్స్ ఎక్కడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఓసారి మాత్రం ఆ సందర్భం వచ్చింది. ఓ మధ్యాహ్నం జాబ్స్ ఇంటి వెనుక లాన్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు జాబ్స్, ఐజాక్సన్.
మాటల మధ్యలో - ‘‘దేవుణ్ణి మీరు విశ్వసిస్తారా?’’ అని అడిగారు ఐజాక్సన్. ‘‘ఏమో చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అన్నారు జాబ్స్. ‘‘కానీ ఒకటనిపిస్తోంది. ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానం, పోగేసుకున్న వివేకం మన మరణం తర్వాత ఎలాగో కొనసాగుతాయని’’ అన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నారు. ‘‘ఈ జనన మరణాలన్నవి ఆన్-ఆఫ్ లాంటివి అనిపిస్తుంది. ఆఫ్ క్లిక్ చేస్తే ఇక అంతే. అయిపోయినట్లు. ముగిసినట్లు.
అందుకేనేమో ఆపిల్ పరికరాలకు ఆన్-ఆఫ్ స్విచ్ పెట్టడం నాకు ఇష్టముండేది కాదు’’ అని చెప్పారు. మరణానికి ముందు కొన్ని నెలలు జాబ్స్, జీవితం గురించి దేవుడి ఉనికి గురించి ఎక్కువగా ఆలోచించారని ఐజాక్సన్ రాశారు.