ఆకులో ఆకునై...
పచ్చదనం నుంచి పసుపు వర్ణం పులుముకున్న ఆకులు కొన్ని... సింధూరం రంగు నింపుకున్న పత్రరాజాలు మరికొన్ని. నారింజలా నయనాలకు కనువిందుచేసే దళాలు ఇంకొన్ని. పచ్చగా ఉన్నప్పుడే కాదు, వాడిపోయి, వడలిపోయి, ఎండిపోయిన విభిన్న రకాల ఆకులను సేకరించి ఇంటి అలంకరణలో ఉపయోగించడమంటే ప్రకృతికి మనసులో పెద్ద పీట వేసినట్టే! తక్కువ ఖర్చుతో అద్భుతమైన పర్యావరణ సౌందర్యాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలంటే ఆకులను మించిన అలంకరణ మరేదీ లేదని ఈ కింది చిత్తరువులను చూస్తే మీరూ ఏకీభవిస్తారు.
ఉడెన్ ఫ్రేమ్ ఉన్న పాత అద్దాల కిటికీ తలుపును తీసుకొని, ఆకులను అతికించే వైపు బూడిదరంగు పెయింట్‌ను పై భాగాన, ఆకుపచ్చని పెయింట్‌ను కింది భాగాన స్ప్రే చేయాలి. ఫ్రేమ్ భాగంలో ఆకుల కాడలను టేపుతో అతికించాలి. ఆకులు అద్దంలో నుంచి వేలాడుతున్నట్టుగా కనిపించేలా అమర్చితే చూడముచ్చటైన వాల్ ఫ్రేమ్ రెడీ అయినట్టే! (ఫొటోలో చూపిన విధంగా)
రాలి, వాడిపోయిన కాడలున్న ఆకులను తీసి, బరువైన పెద్ద పుస్తకం మధ్యలో ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఆ ఆకులను తీయాలి. ఎండిన ఆకులకు నచ్చిన పెయింట్ వేసి, శాటిన్ రిబ్బన్‌కు (తోరణంలా) అతికించాలి. ఆకుల తోరణాన్ని డోర్, విండో భాగాన అమర్చితే అందంగా కనిపిస్తుంది.
రెండు సన్నని పొడవైన కర్రపుల్లలను ప్లస్ (+) ఆకారంలో పెట్టి, మధ్యలో దారంతో కట్టాలి. రంగురంగుల ఎండిన ఆకులను గుచ్చి, కిందిభాగంలో పూసలు లేదా గంటలు కట్టి, వేలాడదీయాలి. ఈ హ్యాంగర్‌ని కిటికీ దగ్గర వేలాడదీస్తే గాలికి కదులుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.
ఆకు డిజైన్ల కోసం ఓ కొత్త ఆలోచన. పాత మ్యాగజీన్ గ్లాసీ పేపర్‌పైన లేదా అందమైన మందపు వస్త్రం పైన ఆకును పెట్టి ఆ షేప్ వచ్చేలా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత నచ్చిన రీతిలో ఆ కృత్రిమ ఆకును మరికొన్ని ఆకులతో కలిపి అలంకరించుకోవచ్చు.
పార్టిషన్ కోసం ఈ రోజుల్లో పెద్ద మిర్రర్స్‌ని వాడుతున్నారు. ప్లెయిన్‌గా ఉండే అద్దాలు అలంకరణప్రాయంగా ఉండవు. అందుకని ఎండిన రకరకాల ఆకులను పార్టిషన్ మిర్రర్‌కు (ఫొటోలో చూపిన విధంగా) అతికిస్తే ఆర్టిస్టిక్‌గా ఉంటుంది.