బాదం భరోసా
రోజుకు నాలుగైదు పలుకులను తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని నేరుగా తినొచ్చు లేక ఏదైనా వంటకంలో వేసుకోవచ్చు. వీటితో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం.
ఆరోగ్యం: రోజూ గుప్పెడు బాదం పలుకులను తింటే శరీరానికి కావాల్సిన మినరల్స్, ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్ అందుతాయి. అందులో ఉండే మెగ్నీషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆల్మండ్స్‌లో షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహంతో బాధపడే వారు వీటిని స్వేచ్ఛగా తినొచ్చు. అలాగే ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి.
చిట్కా: రాత్రి పడుకునే ముందు 6-8 బాదం పలుకులను నీళ్లలో కానీ పాలలో కానీ నానబెట్టాలి. ఉదయం లేచాక వాటిపై ఉండే పొట్టును తీసేసి తింటే చాలు. ఏ రకమైన వ్యాధులు మీ చెంతకు రాకుండా ఉంటాయి.
జుట్టు సౌందర్యం: బాదం నూనె జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని మాత్రమే తగ్గించకుండా చుండ్రు, తెల్ల వెంట్రుకల బారి నుంచి కూడా కాపాడుతుంది. ఈ నూనె జుట్టును ఆరోగ్యంగా ఉంచుతూ నిగనిగలాడేలా చేస్తాయి.
చిట్కా: తలస్నానం చేసే రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటించాలి. మూడు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి కొద్దిగా వేడి చేయాలి. ఆ గోరువెచ్చని మిశ్రమంతో మాడుపై 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత వేడినీళ్లలో ముంచిన టవల్‌ను తలకు కట్టుకొని రెండు గంటలు ఆగి చల్లటి నీటితో తలస్నానం చేస్తే సరి. అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
చర్మ కాంతి: బాదం నూనె లేక బాదంతో తయారు చేసిన మాయిశ్చరైజర్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం నూనెలో ఉండే ఒలీన్ గ్లిజరైడ్, లినోలిక్ యాసిడ్ ముఖంపై మొటిమలు, నల్లమచ్చలను రాకుండా సంరక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్-ఇ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చిన్న పిల్లలకు బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తే కండరాలకు బలం, చర్మానికి మృదుత్వం వస్తుంది.
చిట్కా: పావుకప్పు బాదం పౌడర్ (ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడి చేసు కోవా లి) లో పావుకప్పు బ్రౌన్ షుగర్ వేయాలి. అందులో తేనె, బాదం నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో రోజుకు రెండుసార్లు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.