దీపికా పదుకోన్ సినిమాల్లోకి రాకముందే, డీప్ డిప్రెషన్‌కి వెళ్లిపోయారు. అది ఎవరికీ తెలియదు. దీపికే తొలిసారి 2015లో ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ‘అవునా!’ అని ఆమె అభిమానులు దిగ్భ్రాతికి లోనయ్యారు. ‘అలా చేసి ఉండాల్సింది కాదు’ అని ఆమె సన్నిహితులు మందలించారు! అయితే దీపిక చెల్లెలు అనీషా పదుకోన్ కూడా ‘కుంగుబాటు’ బాధితురాలే అనే సంగతిని ఇటీవల అనీషే స్వయంగా వెల్లడించారు!
సామాన్యులు కూడా ఇష్టపడరు
సెలబ్రిటీల మాట అటుంచండి, తమకున్న మానసిక అస్వస్థతల గురించి మాట్లాడ్డానికి సామాన్యులు కూడా ఇష్టపడరు! ఎవరేం అనుకుంటారో, ఎక్కడ తక్కువైపోతామోనని భయం. అయితే అలాంటి భయాలేమీ అవసరం లేదని ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నారు దీపిక. అందుకే మూడేళ్ల క్రితం తన గురించి బయటికి చెప్పుకున్నారు.
అదే ఏడాది ‘‘లివ్.. లవ్.. లాఫ్’ అనే మెంటల్ హెల్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ సంస్థకు దీపిక చెల్లెలు అనీషా పదుకోన్ కూడా ఒక డైరెక్టర్. ఈ మధ్యే ఈ ఫౌండేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి మన దేశంలో మానసిక ఆరోగ్యం మీద ఓ సర్వే కూడా నిర్వహించింది.
పేరు నిలబెట్టడం పెద్ద ఒత్తిడి!
దీపికా పదుకోన్ బాలీవుడ్ నటిగా ప్రసిద్ధురాలే అయినా, చెల్లి అనీషతో కలిసి సర్వేలలో పాల్గొన్నప్పుడు మానసిక ఆరోగ్యానికి అచ్చమైన ఒక రాయబారిగానే కనిపిస్తారు. అంతకన్నా చురుకైన పాత్రను అనీష పోషిస్తుంటారు. అక్క చేపట్టిన ఈ పనిలో భాగంగా అనీషా ఇటీవల మెంటల్ హెల్త్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ పిల్లలు వీళ్లిద్దరు అనే విషయం తెలిసిందే. అయితే తండ్రి కీర్తిని, ఆ ఇంటి పేరును మోయడం మోయడం ఒక భారమనీ, అదీ మానసిక ఒత్తిడేనని అనీష అంటారు. ఈ సందర్భంగా అనీషా తన జీవితం, కుటుంబం గురించి కొన్ని విషయాలు చెప్పారు.
రోల్ మోడలింగ్ నావల్ల కాదు
‘‘మా కుటుంబంలో అందరూ లక్ష్య సాధకులే. మా ఇంట్లోనే నాకు రోల్‌మోడల్స్ ఉండటం మంచి విషయమే కాని వాళ్లనెవర్నీ నేను అనుకరించట్లేదు.. అనుకరించను కూడా. అందుకనే మా అక్క సినిమా పరిశ్రమలోకి వెళితే.. నేను క్రీడా రంగంలో ఉన్నాను. అలాగని మా నాన్న ఆడిన ఆటను తీసుకోలేదు. ఆయనది బ్యాడ్మింటన్ అయితే నాది గోల్ఫ్. ఇండియాలో అస్సలు క్రేజ్‌లేని స్పోర్ట్ గోల్ఫ్.
అయినా సరే, నేను ఎంచుకున్న దారిలో ముందుకు దూసుకుపోవాలనేది నా లక్ష్యం.. ప్రయత్నం. కాలేజీ రోజుల్లో కాలేజ్ ఫంక్షన్స్‌కి ర్యాంప్ వాక్ చేశాను. అది చూసి చాలా మంది మోడలింగ్ అవకాశం ఇస్తామని వచ్చారు. కాని నా పదోయేటనే నిర్ణయించుకున్నా.. స్పోర్ట్స్ ఆర్ మై గోల్. నేను చదివిన స్కూల్ ఆటల పట్ల చాలా ఆసక్తిని కలిగించింది. అవకాశాలను ఇచ్చింది. వైవిధ్యమైన ఆటలు నేర్చుకున్నాను. రాష్ట్రస్థాయి వరకు బాస్కెట్ బాల్ ఆడాను, జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాను, చివరకు గోల్ఫ్‌లో స్థిరపడ్డాను.
ఆడలేక డిప్రెషన్‌లో పడ్డాను
గోల్ఫర్‌గా ఎదుగుతున్న సమయంలో నాకు నేను పెట్టుకున్న కొన్ని లక్ష్యాలుండేవి. నాకు పాతికేళ్లు వచ్చేసరికి అర్థమైంది.. నేను నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయానని. కుంగిపోయాను. ఒకానొక దశలో గోల్ఫ్ ఆటను వదిలేయాలా అనే నిస్పృహలో పడిపోయాను. థ్యాంక్ గాడ్.. ఆ టైమ్‌లో మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది.
నాకు నేను పెట్టుకున్న లక్ష్యాలు నా స్థాయికి మించినవనీ అర్థమైంది. అదృష్టవశాత్తు అప్పుడే అక్క ‘ది లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌ను ప్రారంభించడం, అందులో నేను భాగస్వామిని కావడం.. డిప్రెషన్‌కు సంబంధించి అవగాహన పెంచుకోవడం జరిగింది. వీటన్నిటి వల్లా త్వరగానే డిప్రెషన్‌లోంచి బయటపడగలిగాను.
ఫ్యామిలీ సపోర్టు ముఖ్యం
అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను.. నాకు, మా అక్కకు బయటి వాళ్ల నుంచే ఒత్తిళ్లు కాని మా కుటుంబం నుంచి ఎప్పుడూ లేవు. మా అమ్మానాన్న మా చదువు, కెరీర్ విషయాల్లో మాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. వాళ్ల ఇష్టాయిష్టాలను మామీదెప్పుడూ రుద్దలేదు. మనం ఇండిపెండెంట్‌గా బతకడం అవసరమే.. అయితే సమస్యలున్నప్పుడు లేదా మానసిక ఒత్తిడి ఫీలవుతున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం’’ అంటారు అనీషా పదుకోన్.
నాన్నతో, అక్కతో.. పోలిక!
ఇంట్లో వాళ్లకన్నా బయటి వాళ్లకు నా మీద ఆశలు, అంచనాలు ఎక్కువ. చెప్పాను కదా.. పదుకోన్ అనే ఆ ఇంటి పేరు వల్ల! అదొక తీవ్రమైన ఒత్తిడి. ఇక పోలికల విషయానికి వస్తే నాకు ఇద్దరితో ఉంటుంది. ఆటల్లో ఉండడం వల్ల మా నాన్నతో కంపేర్ చేస్తారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న మా అక్కతో కూడా (నవ్వుతూ). మా అక్క నాకన్నా వయసులో అయిదేళ్లు పెద్దది. సో... తను నాకు అక్క మాత్రమే కాదు.. అమ్మ కూడా. తను నా పట్ల అంత కేరింగ్‌గా ఉంటుంది కూడా. అయితే మా ఇంట్లో మాకేం పోల్చిచూసుకోవడాలు లేవు. అశలూ, అంచనాలూ లేవు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment