అనితరసాధ్యం | Anita read higher education This car is encouraged | Sakshi
Sakshi News home page

అనితరసాధ్యం

Published Fri, Mar 22 2019 12:37 AM | Last Updated on Fri, Mar 22 2019 12:37 AM

Anita read higher education This car is encouraged - Sakshi

నడవడానికి కాళ్లు కావాలేమో కానీ, జీవితంలో ఎదగడానికి కాళ్లతో పనేముందన్నట్లు అనిత దూసుకెళుతున్న విధానం చూస్తుంటే.. మరెవరికీ ఇది సాధ్యం కాదని (అనితరసాధ్యం) అనిపిస్తుంది. అయితే ‘‘లైఫ్‌లో నేను పరుగులు తీయడమే కాదు, నాలాంటి వాళ్లనూ ఉత్సాహంగా పరుగులు తీయిస్తాను’’ అని అనిత ఆత్మవిశ్వాసంతో అంటున్నారు.

అనిత అందరిలాగే పుట్టింది. చలాకీగా అడుగులు వేసింది, పరుగులు తీసింది, ఆడింది, పాడింది. ఇంతలోనే ఊహించని విధంగా ఆమె ఆరో ఏట అకస్మాత్తుగా నడవలేక కూర్చుండిపోయింది. ఆమె నడకను పోలియో ఎత్తుకుపోయింది. రెండు కాళ్లు కదపలే కపోయింది అనిత. ఆమెది జైపూర్‌. నడక కోసం అనిత కర్ర కాళ్ల మీద ఆధారపడవలసి వచ్చింది. అయితే ఆ కర్రకాళ్లు ఆమె విజయాలకు ఎన్నడూ అడ్డంకి కాలేదు. చిన్నతనంలోనే అనిత సపోర్ట్‌ వీల్స్‌తో బైక్‌ నడిపింది. పెద్దయ్యాక మారుతి ఆల్టో కారు కొనుక్కుంది. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్‌లను చేతితో వాడే విధంగా మార్పులు చేయించుకుంది. తనకు కావలసిన వేగాన్ని మార్చుకునేందుకు అనువుగా డాష్‌ బోర్డు మీద ఒక లీవర్‌ని ఏర్పాటు చేయించుకుంది. జైపూర్‌లోని రాజేశ్‌ శర్మ అనే ఒక మెకానిక్‌ ఈ విధంగా కారులో మార్పులు చేశాడు. ఈ కస్టమైజ్డ్‌ మార్పుల విద్యను ‘జుగాడ్‌’ అంటారు.

‘‘ఈ కారు వల్ల డ్రైవింగ్‌ నేర్చుకోవడంతో పాటు, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాను’’ అంటున్నారు అనిత. రాజేశ్‌ ఇప్పటికి ఈ విధంగా మూడు వేల కార్లు తయారుచేశాడు. శరీరంలో కాళ్ల భాగం అస్సలు పనిచేయనివారికి అనువుగా మరికొన్ని మార్పులు చేస్తున్నాడు రాజేశ్‌శర్మ. అంతేకాదు ఎవరికి అవసరమో వాళ్ల ఇంటి దగ్గరకు వచ్చి మరీ కారుకి సంబంధించిన పనులు చేస్తాడు రాజేశ్‌. గేర్‌ బాక్సుని ఏ మాత్రం కదపకుండా, స్టీరింగ్‌ చక్రానికి కిందిగా లీవర్లు ఉంచుతాడు. బైక్‌కి ఉన్నట్లుగానే యాక్సిలరేటర్‌ను తేలికగా ఉపయోగించుకునేలా చేస్తాడు. 

ఈ కారే వెన్ను తట్టింది!
అనిత ఉన్నత చదువులు చదవడానికి ఈ కారే ప్రోత్సహించింది. ‘డిజెబిలిటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ అనే అంశం మీద ఐఐఎం ఇండోర్‌లో పి.హెచ్‌డి. చేయడానికి ఆమెకు ఈ కారే సహకరించింది. ఇప్పుడు తనలాంటి వారికి ఆమె కార్‌ డ్రైవింగ్‌ నేర్పించడం కూడా ఈ కారు కారణంగానే! అనిత పిహెచ్‌డి చేసే సమయంలో నవీన్‌ గులియా అనే సాహస బాలుడిని కలవడం తటస్థించింది. అతడు సాహసాలలో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు. అతనికి మెడ నుంచి కింది వరకు శరీరం నిర్జీవం అయిపోయింది. అతడితో కార్‌ డ్రైవింగ్‌ గురించి మాట్లాడుతూ ఉండగానే, ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి, అనిత తయారు చేయించుకున్న కారులో ఎలా డ్రైవింగ్‌ చేయొచ్చో నేర్పించమంది.

ఆ అమ్మాయి సరదాగానే అడిగింది కానీ, అనిత డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించడానికి అదే పునాది అయ్యింది. ఆ తరవాత అనిత, దివ్యాంగుల డ్రైవింగ్‌ స్కూల్స్‌ గురించి ఎంక్వయిరీ చేశారు. ఎవ్వరికీ లైసెన్సు లేదు. ఇటువంటివారికి ట్రయినింగ్‌ ఇవ్వాలంటే లైసెన్స్‌ తప్పనిసరి. ఈ క్రమంలో భారతదేశంలో 2013లో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ మొదలైంది. అప్పటికే అనిత తన కారులో కొందరికి డ్రైవింగ్‌ నేర్పారు. తానూ ప్రొఫెషనల్‌గా మారాలనుకున్నారు. ‘‘డ్రైవింగు నేర్చుకునేవారికి మొదటి అడ్డంకి మనోబలం లేకపోవడమే. వారి మీద వారికి నమ్మకం లేకపోవడం మరో కారణం’’  అంటారు అనిత. 

అనిత కూడా లైసెన్సు తీసుకుని, స్వయంగా డ్రైవింగ్‌ నేర్పించడం మొదలుపెట్టారు. ఆమె విద్యార్థులలో ఒకరికి ఎడమ చేయి లేదు. కుడి చేత్తోనే స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ కారు నడుపుతున్నారు. గేర్లు మార్చేటప్పుడు ఏ మాత్రం తడబాటు ఉండేలా ధైర్యాన్ని అలవరుస్తున్నారు అనిత. ప్రారంభించిన ఎనిమిది నెలలకే 16 మందికి డ్రైవింగ్‌ నేర్పారు అనిత. ఒకసారి ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటున్నారు ఆమె ఇప్పుడు 17వ స్టూడెంట్‌కి డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ఆరు వేల రూపాయల ఫీజు తీసుకుంటూ డ్రైవింగ్‌ నేర్పిస్తున్న అనిత, ఈ ఫీజులో అధికభాగం వీల్‌చెయిర్లకే కేటాయిస్తున్నారు. అందుకే అందరి కంటె కొద్దిగా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. శరీర బలం కాదు, మనోబలం చాలు కార్యసాధనకు అని నిరూపించారు అనిత.
– వైజయంతి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement