బ్రాంకైటిస్‌ను ఎదిరించిన అఫ్ఘాన్ వనిత | Aphghan woman against bronchitis | Sakshi
Sakshi News home page

బ్రాంకైటిస్‌ను ఎదిరించిన అఫ్ఘాన్ వనిత

Published Fri, Sep 26 2014 11:50 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

బ్రాంకైటిస్‌ను ఎదిరించిన అఫ్ఘాన్ వనిత - Sakshi

బ్రాంకైటిస్‌ను ఎదిరించిన అఫ్ఘాన్ వనిత

  • బ్రాంకైటిస్‌ను ఎదిరించిన అఫ్ఘాన్ వనిత
  •  అడ్డంకులు దాటుకుని తైక్వాండోలో ప్రతిభ
  • ఆ అమ్మాయి లక్ష్యం ఆటలు కాదు.... చదువుకోవడం. కానీ చదువు సాగాలంటే సమాజ కట్టుబాట్లను సైతం ఎదిరించాల్సిన పరిస్థితులు... పోనీ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉందంటే అది కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులకు కుటుంబం కూడా తలొగ్గాల్సిందే. ఎదిరిస్తే ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆ అమ్మాయికి అనుకోని అనారోగ్యం. చదువుకోవాలనే కోరికను నిట్టనిలువునా పాతరేసిన ఓ మహమ్మారి రోగం ‘క్రానికల్ బ్రాంకైటిస్’.

    మనిషిని నిట్టనిలువునా దహించడమే కాదు.... కుదురుగా ఒక్క క్షణం కూడా నిలువనీయకుండా వచ్చే విపరీతమైన దగ్గు. ఈ జబ్బు బారిన పడిన అఫ్ఘాన్ అమ్మాయి లైలా హోస్సేని తైక్వాండోను ‘మందు’గా ఎంచుకుంది. మొదట జబ్బును నయం చేసుకునేందుకే అనుకున్నా.. రానురాను ఆటపై మక్కువ పెరగడంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ అంతర్జాతీయ యవనికపై తన సత్తాను చాటింది. రోగాన్ని జయించిన హోస్సేని ప్రస్తుతం ఇంచియాన్ ఏషియాడ్‌లోనూ పతకం కోసం పోరాడుతోంది.
     
    హొస్సేని తొలిసారిగా నాలుగేళ్ల కిందట బంగ్లాదేశ్‌లో జరిగిన దక్షిణాసియా క్రీడలతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రీడల్లో త్వైకాండోలో ఆమె రజత పతకం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ ఆఫ్ఘాన్ క్రీడాకారిణి పలు అంతర్జాతీయ పోటీల్లో బరిలోకి దిగింది. ఇక 2010 ఆసియా క్రీడల్లో ఫిన్ వెయిట్ 46 కేజీల విభాగంలో పోటీపడిన హొస్సేని ప్రి క్వార్టర్ ఫైనల్లో ఓడి ఇంటిదారి పట్టింది. అయితే ఈ సారి క్రీడల కోసం తీవ్రంగా సాధన చేసిన హొస్సైని పతకంపై అంచనాలు పెట్టుకుంది. అయితే ఆమెకు ఇంచియాన్ క్రీడల్లో పతకం సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
     
    పేదరికాన్ని అధిగమించి...

    అఫ్ఘానిస్థాన్‌పై సోవియట్ యూనియన్ దండయాత్ర చేసినప్పుడు ఇరాన్‌కు శరణార్థులుగా వెళ్లిన హొస్సేని కుటుంబం అక్కడ పడరాని కష్టాలు పడింది. 2001లో స్వదేశానికి చేరుకున్నా ఆ కష్టాలు వీడలేదు. పేదరికంతో సహవాసం చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అనే తీవ్రమైన దగ్గు ఆమెను  వెంటాడింది. దీన్ని అధిగమించేందుకు చేసిన తైక్వాండో సాధన లైలా హొస్సేని అనుకోకుండా ఈ క్రీడనే కెరీర్‌గా ఎంచుకుంది. అప్పటి నుంచి త్వైకాండోనే ఆమె ఆరోప్రాణం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుదిరిగి చూడలేదు. తల్లిదండ్రుల నుంచి సహకారం కూడా తోడవ్వడం ఆమెకు కలిసొచ్చింది.
     
    భవిష్యత్‌పై బెంగ !

    అఫ్ఘానిస్థాన్ నుంచి ఈ ఏడాది అమెరికా దళాలు పూర్తిగా వైదొలుగుతుండటంతో ఆ దేశ క్రీడాకారుల్లో ముఖ్యంగా మహిళల్లో మళ్లీ భయం మొదలైంది. తాలిబన్లు అధికారంలో ఉన్న రోజుల్లో మహిళల్ని క్రీడలవైపు అనుమతినిచ్చేవారే కాదు. అమెరికా దళాలు వెళ్లిపోవడం వల్ల సైన్యంపై, పోలీసులపై ముష్కరులు దాడులు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారేమోనన్న ఆందోళన వారిలో మొదలైంది. లైలా హొస్సేని కూడా ఇదే రకమైన భయాన్ని వ్యక్తం చేసింది. తాలిబన్లు మళ్లీ చెలరేగితే క్రీడాకారిణులకు 13 ఏళ్లుగా ఉన్న స్వేచ్ఛ మళ్లీ హరించుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అదే జరిగితే తైక్వాండో కెరీర్‌ను ముగించడం మినహా మరో మార్గం ఉండదని హొస్సేని అంటోంది. ఒకవేళ తాలిబన్ల అడ్డంకులు లేకపోతే తనకు కాబోయే భర్త (కుంగ్‌ఫు కోచ్, అథ్లెట్) సహకారంతో అంతర్జాతీయంగా రాణిస్తానని లైలా ధీమాగా చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement