140 కిలోల బరువు పెరిగాడు.. ఆ తర్వాత.. | Arjun Kapoor on battling depression | Sakshi
Sakshi News home page

తండ్రి విడిచి వెళ్లాడు.. 140 కిలోల బరువు పెరిగాడు

Published Sat, Feb 8 2020 5:08 AM | Last Updated on Sat, Feb 8 2020 8:51 AM

Arjun Kapoor on battling depression - Sakshi

అర్జున్‌ కపూర్‌

తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి నైరాశ్యంలో మునిగిపోయింది. డిప్రెషన్‌లో తిని తిని 140 కేజీల బరువు పెరిగాడు. చదువు రాలేదు. సినిమాల్లో పని చేస్తే ఎప్పటికి గట్టెక్కుతాడో తెలియదు. తను ఒక్కడు. ఎదురుగా కనిపిస్తున్నది అంతూ దరీ లేని జీవన సాగరం. అర్జున్‌ కపూర్‌ చేసిన యుద్ధం కఠినమైనది. అన్ని కెరటాలను దాటి అతడు గట్టు చేరగలిగాడు.

అర్జున్‌ కపూర్‌కు చిన్నప్పుడు కార్లంటే పిచ్చి. పిల్లలు ఆడుకునే కార్లు. పిల్లలు నడిపే కార్లు. అసలు కార్ల వలే కనిపించే పిల్లల కార్లు. కారు కొనివ్వమని తండ్రిని కోరేవాడు. దేశ విదేశాల పిల్లల కార్లు తెప్పించమని అడిగేవాడు. తండ్రి వాటి ఎందుకు తేడు? అతడు ప్రసిద్ధ నిర్మాత బోని కపూర్‌. ఎంతో డబ్బు ఉంది. తెస్తాడు. ఒకటి కాదు రెండు కాను 500 కార్లు చిన్నప్పుడు అర్జున్‌ కపూర్‌ దగ్గర ఉండేవి. కీ ఇచ్చేవి, బ్యాటరీతో నడిచేవి, రిమోట్‌ మీద పని చేసేవి.... అవన్నీ ఒకరోజు మంత్రించినట్టు ఆగిపోయాయి. కదల్లేదు. మెదల్లేదు. వాటి నోరు పడిపోయినట్టయ్యింది. అది 1996. అప్పటికి అర్జున్‌కపూర్‌ వయసు 11 ఏళ్లు. సరిగ్గా అప్పుడే బోనికపూర్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకుని ఆ ఇల్లు విడిచిపెట్టాడు.
∙∙
బోనీ కపూర్‌ భార్య మోనాకపూర్‌ ఇది ఊహించలేదు. తనకేం తక్కువ. మంచి కుటుంబం నుంచి వచ్చింది. భర్తకు తోడుగా నిలిచింది. ఇద్దరు పిల్లలను కంది. ప్రొడ్యూసర్‌గా సినిమాలు తీసింది. టీవీ షోస్‌ చేసింది. ఇన్ని చేస్తూ కుటుంబాన్ని, భర్తను చూసుకుంటూ ఉంటే బోని కపూర్‌ది ఈ నిర్ణయం. అర్జున్‌ కపూర్‌ చిన్న పిల్లాడు. కూతురు అన్షులా ఇంకా చిన్నపిల్ల. బోని కపూర్‌–శ్రీదేవిల పెళ్లిని బోనికపూర్‌ కుటుంబం అంగీకరించలేదు. బోని కపూర్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయాక కూడా మోనాకపూర్‌ మామ గారు, నిర్మాత సురీందర్‌ కపూర్‌ కోడలిని ఇంట్లోనే ఉండమన్నాడు. పిల్లల బాగోగులు తనే చూశాడు.

కాని ఊహించని ఈ దెబ్బకు మోనాకపూర్‌ విలవిల్లాడింది. పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టుగా భర్త వెళ్లిపోవడంతో ఆమె హైపర్‌టెన్షన్‌తో మంచం పట్టింది. ఇదంతా అర్జున్‌ కపూర్‌ చూసేవాడు. అతనికి తల్లంటే చాలా ఇష్టం. తండ్రి లేని ఈ రోజులలో ఇంకా కష్టం. ఒక రెక్క కింద తల్లిని, ఒక రెక్క కింద చెల్లిని అతడు పెట్టుకుని ఇంట్లో ఉండిపోయాడు. చదువు తలకెక్కలేదు. టెన్త్‌ వరకు చదివాడు అంతే. అలోచనలు అంతూదరి లేకుండా సాగిపోయేవి. మరోవైపు తండ్రి తన మారుతల్లితో మరో ఇద్దరుపిల్లలతో ఆ లోకం వేరు అన్నట్టుగా కనిపిస్తూ ఉండేవాడు. వాళ్ల వార్తలు తెలుస్తూ ఉండేవి. ఈ వొత్తిడి అంతా పని చేసింది. తినడం మొదలెట్టాడు. ఒక్క పట్టున మూడు బర్గర్‌లు లాగించేసేవాడు. బరువు పెరిగాడు. పెరిగాడు. పెరిగాడు. 140 కేజీలు పెరిగాడు. ఇప్పుడు ఏం చేయాలి?
∙∙
తెలిసింద ఒక్కటే. సినిమా పరిశ్రమ. ‘కల్‌ హో న హో’ సినిమాకు దర్శకత్వ శాఖలో చేరాడు. దర్శకుడు కావాలని అతడికి ఉండేది. కాని తన శరీరం పెరిగిపోవడంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు కాదు. ఇంటి వ్యధ, ఈ శరీర న్యూనత అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసేది. కొడుకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడని తెలిసి బోని అతణ్ణి తను తీస్తున్న ‘నో ఎంట్రీ’ (పెళ్లాం ఊరెళితే) సినిమాకు దర్శకత్వ శాఖలో పెట్టాడు. అప్పుడే ఆ సినిమాలో నటిస్తున్న సల్మాన్‌ఖాన్‌కు అర్జున్‌ కపూర్‌ బాగా దగ్గరయ్యాడు. తర్వాత బోని కపూరే నిర్మించిన ‘వాంటెడ్‌’ (పోకిరి) సినిమాకు కూడా అర్జున్‌ కపూర్‌ దర్శకత్వ శాఖలో పని చేశాడు.

కష్టపడి పని చేసే తత్త్వం ఉంది... తన మానాన తానుంటాడు... డీసెంట్‌ బిహేవియర్‌... అన్నింటికి మించి సీన్‌ చెప్పేటప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్‌తో చెబుతున్నాడు... ఇవన్నీ గమనించిన సల్మాన్‌ఖాన్‌ ఒకరోజు షూటింగ్‌ అయిపోయాక అర్జున్‌ కపూర్‌ని పిలిచి ‘నువ్వెందుకు ఈ పని చేస్తున్నావ్‌. యాక్టింగ్‌ చెయ్‌’ అన్నాడు. అర్జున్‌కపూర్‌ షాక్‌ అయ్యాడు. ‘ఈ 140 కేజీల శరీరంతోనా?’ అన్నాడు. ‘నువ్వు నాతో ఉండు... నీ బరువు నేను తగ్గిస్తాను’ అన్నాడు సల్మాన్‌ఖాన్‌. అర్జున్‌ కపూర్‌ సల్మాన్‌ ఖాన్‌ను తన గురువుగా చేసుకున్నాడు. నాలుగేళ్లు సల్మాన్‌తో ఉన్నాడు. బరువు తగ్గాడు. దాదాపు యాభై కేజీల బరువు తగ్గాడు. యాభై కేజీలు! ఇప్పుడు అతడు అన్ని విధాలుగా హీరో కావడానికి రెడీ. కాని అర్జున్‌ మనసులో ఒకటే పట్టుదల... తండ్రి ద్వారా మాత్రం నటుడిగా లాంచ్‌ కాకూడదు అని.
∙∙
అర్జున్‌ కపూర్‌ ఇప్పుడు తన ఫొటోలు గట్రా పట్టుకొని స్టుడియోలకు తిరగడం మొదలుపెట్టాడు. తండ్రికి అంత పేరు ఉంది. బాబాయ్‌ అనిల్‌ కపూర్‌ సూపర్‌స్టార్‌. పిన్ని శ్రీదేవి మరో సూపర్‌స్టార్‌. ఎవరు సాయం చేసినా క్షణాల్లో ఏదో ఒక సినిమాలో హీరో అవుతాడు. కాని తన కృషి, పట్టుదల, ప్రతిభతో హీరో అవ్వాలనుకున్నాడు అర్జున్‌ కపూర్‌. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో జరిగే ఆడిషన్స్‌కు హాజరయ్యాడు. కాని దాని అధినేత ఆదిత్య చోప్రాకు అర్జున్‌ కపూర్‌ మీద నమ్మకం కుదరలేదు. వెనక్కు పంపించేశాడు. అర్జున్‌ కపూర్‌ నిరాశ పడలేదు. ఇంటికి వెళ్లి నటన మీద మరింత దృష్టి పెట్టాడు. కష్టం చేశాడు. మూడు నెలల తర్వాత అదే యశ్‌రాజ్‌ స్టుడియోకు వచ్చి మళ్లీ ఆడిషన్స్‌ ఇచ్చాడు. ఆ పట్టుదల ఆదిత్యా చోప్రాకు నచ్చింది.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలకు కాంట్రాక్ట్‌ సైన్‌ చేయించాడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో మూడు సినిమాలంటే మాటలు కాదు. ఈ విషయం పరిగెత్తుకుంటూ వచ్చి తల్లికి చెప్పాడు. అప్పటికే ఆమె కేన్సర్‌ బాధితురాలు. కొడుకు చెప్పిన వార్తకు సంతోషంతో ఏడవడం మొదలుపెట్టింది. కొడుకు మొదటి సినిమా ‘ఇష్క్‌జాదే’ మొదలైతే సంతోషంతో తబ్బిబ్బు అయ్యింది. కాని ఆమె సంతోషం పూర్తిగా తీరలేదు. మరో నెలలో ఆ సినిమా విడుదలవుతుందనగా ఆమె చావుకు సమీపించింది. ఆమె చేసిన చివరి కాల్‌ సల్మాన్‌ ఖాన్‌కే. ‘నా కొడుకును ఒక స్థితికి తెచ్చావు. నీకు చాలా థ్యాంక్స్‌’ అని సల్మాన్‌కు కృతజ్ఞతలు చెప్పిందామె. తర్వాత ఈ లోకాన్ని వీడింది.
∙∙
తండ్రితో మానసిక దూరం, ఇప్పుడు తల్లితో భౌతికదూరం... అర్జున్‌ మీద ఒత్తిడి కొనసాగింది. కాని తానొక మంచి నటుడు అని నిరూపించుకోవడానికి కష్టపడి పని చేశాడు. ‘ఇష్క్‌జాదే’ పెద్ద హిట్‌ అయ్యింది. ఆ వెంటనే ‘ఔరంగజేబ్‌’ సినిమాలో డబుల్‌ యాక్షన్‌ చేశాడు. ఆడలేదు. కాని రణ్‌వీర్‌ సింగ్‌తో చేసిన ‘గూండె’ సినిమా మాస్‌ హిట్‌ అయ్యింది. పంజాబీవాడుగా నటించిన ‘2 స్టేట్స్‌’ ఎంత పెద్ద హిట్‌ అంటే నూరు కోట్ల కలెక్షన్‌ సాధించిన అర్జున్‌ కపూర్‌కు విపరీతమైన క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ సినిమాతో అర్జున్‌ కపూర్‌ ఎస్టాబ్లిష్డ్‌ స్టార్‌ అయ్యాడు. ఎంతగా స్టార్‌ అంటే తండ్రి అతడి డేట్స్‌ తీసుకుని ‘తేవర్‌’ (తెలుగులో ఒక్కడు) తీసేంతగా.
∙∙
అర్జున్‌ కపూర్‌ తన ప్రయోగాలు కొనసాగించాడు. హౌజ్‌హజ్బెండ్‌గా అతడు నటించిన ‘కి అండ్‌ కా’ పెద్దగా ఆడలేదు. శ్రద్ధాకపూర్‌తో నటించిన ‘హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్‌’ యావరేజ్‌గా నిలిచింది. బాబాయ్‌ అనిల్‌కపూర్‌తో నటించిన ‘ముబారకన్‌’ యావరేజ్‌గా నిలచింది.  కాని అర్జున్‌ కపూర్‌ భారీగా ఆశలు పెట్టుకున్న భారీ చిత్రం ‘పానీపట్‌’. ‘లగాన్‌’, ‘జోధా అక్బర్‌’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తీసిన అషుతోష్‌ గోవారికర్‌ ఈ సినిమాను అంతే భారీగా తీశాడు. మరాఠాలకు అఫ్ఘన్‌లకు జరిగిన మూడవ పానిపట్‌ యుద్ధం ఈ సినిమా. అర్జున్‌కపూర్‌ మరాఠాగా నటించాడు. కాని సినిమా విడుదలయ్యాక అందులో మరాఠాలను సరిగ్గా చూపలేదని అత్యంత కీలకమైన తొమ్మిది నిమిషాల సీన్‌ను తీసేయాల్సి వచ్చింది. దాంతో ఆ సినిమా నడుము విరిగింది. అర్జున్‌ కపూర్‌కు ఇది పెద్దదెబ్బ. కాని యుద్ధం తెలిసినవాడు కత్తి వదలడు. అర్జున్‌ ఇప్పుడు ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ అనే కామెడీ సినిమాలో నటిస్తున్నాడు.
∙∙
అర్జున్‌ కపూర్‌కు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పిత, అతడి తొలి హీరోయిన్‌ పరిణితి చోప్రా, అనుష్క శర్మ... వీరు అతని గర్ల్‌ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ప్రస్తుతం అతడు ఒక బిడ్డ తల్లి అయిన మలైకా అరోరాతో డేటింగ్‌లో ఉన్నాడు.
∙∙
అర్జున్‌ కపూర్‌ ఎదుటివారిని ఆశ్చర్యపరిచే పనులు మరిన్ని చేయవచ్చు. కాని అవన్నీ అతడు చేస్తున్న యుద్ధానికి ఒక కొనసాగింపుగానే అర్థం చేసుకోవాలి.

– సాక్షి ఫ్యామిలీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement