
ప్రాస మాటలు పొదగడంలో సి.నారాయణరెడ్డిది అలవోక శైలి. వాటివల్ల ఆయన పాటలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అయితే అలాంటి ప్రాస ఆయన ఎవరి నుంచి వచ్చినా ఆనందించేవారని చెప్పడానికి ఈ సంఘటన సాక్ష్యం.
బాపట్లలో ఒక కళాశాల సాహిత్య కార్యక్రమం కోసం సినారె వెళ్లాలి. ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి విజయవాడలో దిగారు. అక్కడ ఆయనను బాపట్ల విద్యార్థి సంఘ నాయకుడు పికప్ చేసుకుని, కారులో తీసుకెళ్తున్నాడు. ప్రయాణంలోనే సినారెకు అట్లా కునుకు పట్టింది. మధ్యలో ఒక చోట కళ్లు తెరిచి, సినారె తనదైన పద్ధతిలో ‘ఈ తేరు(రథం) ఎక్కడ నడుచుచున్నది?’ అన్నారు.
ఆ సమయంలో కారు ఈతేరు అనే గ్రామం మీదుగా వెళ్తోంది. అది బాపట్లకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది.
విద్యార్థి వెంటనే, ‘ఈ తేరు ఈతేరున బడి పోవుచున్నది’ అని జవాబిచ్చాడు.
సినారె విద్యార్థి సమయస్ఫూర్తికి సంతోషించి, తన జేబులోంచి పెన్ను తీసి బహుమతిగా ఇచ్చారు.
(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)