కేశ సౌందర్యం
అందమె ఆనందం
⇒ కొబ్బరి నూనె, ఆముదం ఒక్కొక్కటి ఒక కప్పు తీసుకుని అందులో అర కప్పు కరివేపాకు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే కరివేపాకు గలగలలాడే వరకు మరిగించి దించిన తర్వాత రెండు – మూడు కర్పూరం ముక్కలు వేసి చల్లారిన తర్వాత వడపోయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పూట తలకు పట్టించి మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే కుదుళ్లు గట్టిపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. నూనె మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిలవ చేసుకుని వాడుకోవచ్చు.
⇒ కరివేపాకు, తులసి, మందార పూల రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి మరిగించిన మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే కేశాలు నిగనిగలాడతాయి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి.
⇒క్రమం తప్పకుండా వారానికొకసారి కొబ్బరి నూనెతో మర్దన చేసినా కూడ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
⇒నాలుగు కప్పుల నీళ్లలో ఒక కప్పు ఉసిరిక కాయలు, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు ఒక కప్పుకు వచ్చేదాకా మరిగించాలి. ఆ నీటిలో రెండు కప్పుల గోరింటాకు, ఒక కోడిగుడ్డు, నిమ్మరసం (ఒక కాయది) కలిపి జుట్టుకుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.
⇒గుప్పెడు ఉసిరిక కాయలను ఒక కప్పు పాలలో నానబెట్టి రెండు గంటల తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది.
⇒ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు పొడిలో ఒక కోడిగుడ్డు సొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ ఇన్‌స్టంట్ కాఫీ పొడి లేదా కాఫీ డికాషన్ కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి ముప్పావు గంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.