
ఎటువంటి జుట్టుకైనా తప్పని సమస్య ఇది. ముఖ్యంగా స్కూలుకెళ్లే పిల్లల్లో మరీ ఎక్కువ. పేలను వదిలించడానికి సులువైన పద్ధతులు ఉన్నప్పటికీ రసాయనాలతో కూడిన వాటిని వాడడం వల్ల ఎదురయ్యే సైడ్‌ఎఫెక్ట్స్‌నూ ఎదుర్కోవాల్సిందే. మందులు వాడకుండా సహజ పద్ధతిలో పేలను వదిలించాలంటే... తలకు నిండుగా నూనె పట్టించి అరగంట సేపు అలాగే ఉంచాలి. అవసరమైతే తలకు క్యాప్ పెట్టేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల పేలకు గాలి తగలక చనిపోతాయి.
పేలకు పరిస్థితులకు తట్టుకుని బతకగలిగిన ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. పొడవు జుట్టు ఉన్నట్లయితే తలకు నూనె పట్టించినప్పుడు అవి తల నుంచి బయటకు వచ్చి జుట్టులో దాగి రక్షించుకుంటాయి. కాబట్టి పొడవు జుట్టు ఉంటే తలకు దగ్గరగా అంటే టైట్‌గా పోనీటైల్ వేసుకున్నట్లు క్లిప్ పెట్టాలి. అరగంట తర్వాత పళ్లు చిక్కగా ఉన్న దువ్వెనతో కుదుళ్ల నుంచి చివర్ల వరకు జుట్టునంతటినీ దువ్వాలి. ఇప్పుడు మామూలుగా తలస్నానం చేస్తే పేల బాధ పోవడంతోపాటు కేశాలకు నూనె బాగా పట్టడం వల్ల మృదువుగా మారతాయి.