ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్.. | better investment plans lead to happy life | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్..

Published Fri, Aug 1 2014 11:56 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్.. - Sakshi

ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్..

ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టే మదుపు
 
బోలెడంత కష్టపడితే గానీ కాస్తంత సంపాదన చేతికి రాదు. మరి మనం ఇంత కష్టపడుతుంటే..  మనం సంపాదించిన డబ్బు... అంతంత మాత్రం వడ్డీలు ఆర్జిస్తూ బ్యాంకులో దర్జాగా కూర్చుంటే ఎలా కుదురుతుంది. వేణ్నీళ్లకు చన్నీళ్లలాగా అది కూడా మరికాస్త అదనంగా రాబడి తెచ్చిపెట్టినప్పుడే కదా సంపాదించిన డబ్బుకు సార్థకత. ఇలా లెక్కలేసుకుని రకరకాల సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఎవరో చెప్పారని ఒక దాంట్లోను.. భారీగా రాబడి వస్తోందంటూ మరో దాంట్లోనూ పెట్టేసి ఒకోసారి చేతులు కాల్చుకుంటూ ఉంటాం. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసుకుంటూంటాం. ఇలా జరగకుండా.. పెట్టే పెట్టుబడి విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక ప్రణాళిక పట్టాలు తప్పకుండా చూసుకోవడాన్ని వివరించేది ఈ కథనం.
 
మొహమాటానికి పోతే...
 
సన్నిహితులు చెప్పారనో ... బంధువులు చెప్పారనో మొహమాటానికి పోయి నిరుపయోగకరమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ బాగుందని.. ఆ కంపెనీ షేరు బ్రహ్మాండంగా పెరుగుతుందని ఎవరో చెబితే కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. సదరు సాధనం మనకు సరిపడదని తెలిసిన తర్వాత కూడా విధిలేని పరిస్థితుల్లో కొనసాగించేస్తుంటాం. అలాగని వారి మాట అస్సలు వినకూడదని కాదు. కానీ, ఆయా సాధనాల గురించి అస్సలు తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మొహమాటాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
 
లక్ష్యం అంటూ ఉండాలి..

పెట్టుబడులకు ఏదైనా లక్ష్యం ఉండాలి. దాన్ని బట్టే ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందనేది తెలుస్తుంది. దీన్ని బట్టే.. ఏ సాధనంలో పెట్టుబడి పెట్టాలన్నది అవగాహనకు రావచ్చు. ఉదాహరణకు వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో.. పిల్లల చదువుల కోసమో ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.  ఏం చేయాలన్నది నిర్దేశించుకోకుండా.. ఏదో పేరుకి ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఒక లక్ష్యం అంటూ విధించుకుంటారో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు వైదొలగాలి అన్నదానిపై స్పష్టత వస్తుంది.
 
రాబడే ప్రామాణికం కాదు..
 
ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొందరు మిగతా అంశాలను పక్కన పెట్టి కేవలం రాబడే ప్రామాణికంగా చూసుకుంటూ ఉంటారు. తమ చేతిలో డబ్బు ఉన్న సమయాన్ని బట్టి అప్పటికప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్కువ ఇస్తుంది వంటివి లెక్కలేసుకుంటారు. స్టాక్ మార్కెట్లు బాగుంటే షేర్లవైపు వెళ్లిపోవడం... బంగారం మెరుగ్గా అనిపిస్తే కొనేయడం.. వడ్డీ రేట్లు బాగున్నాయని ఎఫ్‌డీలు చేసేయడం.. ఇలా ప్రణాళిక లేకుండా డబ్బును అందులోను, ఇందులోనూ తిప్పేస్తూ నానా హైరానా పడితే చివరకు చేతికి వచ్చేదేమీ ఉండదు. చాలా మంది ఇన్వెస్టర్లలో ఇలాంటి ధోరణే ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు భారీ రాబడులు అందించే సాధనాల కోసం వెతుకుతూనే ఉంటారు. చివరికి ఆయా సాధనాలు తార స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుని కూర్చుంటారు. కనుక  అధిక రాబడులనేవి అభిలషణీయమే అయినా.. రిస్కులు చూసుకుని అడుగేయాలి.
 
పన్నుల భారం తగ్గించుకోవడానికి..
 
పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆఖరు నిమిషంలో చాలా మంది వేతన జీవులు.. ఆదరాబాదరాగా బీమా పాలసీలు తీసుకోవడమో లేదా ఫండ్స్‌లోనో మరో సాధనంలోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు.  ఆయా పాలసీలు, ఫండ్లు తమ ఆర్థిక లక్ష్యాలకు ఎంత వరకూ ఉపయోగపడతాయన్నది పట్టించుకోరు. ముందు పన్ను భారం తగ్గితే చాలనుకుంటారు. కానీ సదరు యులిప్స్ కావొచ్చు.. లేదా మరో ఫండ్  కావొచ్చు ఆ తర్వాత సరైన పనితీరు కనపర్చకపోతే.. పన్ను పరంగా వచ్చిన లాభం, అందులో పోతుంది. ఇలాంటి వాటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అదేంటంటే.. మనం పెట్టే పెట్టుబడి అనేది మన లక్ష్యాలకు ఉపయోగపడేదిలా ఉండాలి. మన రిస్కు సామర్థ్యానికి తగ్గట్లుగా ఉండాలి. వాటి ద్వారా పన్నుపరమైన ప్రయోజనాలు అదనంగా రావాలి. అంతే తప్ప.. కేవలం పన్ను ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఏవేవో పోగేసుకోవడం అనవసరం.
 
ఉచిత సలహాలతో జాగ్రత్త..

ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి ఉచిత సలహాలిచ్చే వారి కన్నా కొంత ఫీజు ఇవ్వాల్సి వచ్చినా ... సరైన ఫైనాన్షియల్ అడ్వైజరు సలహాలు తీసుకోవడం మంచిది. ఇక్కడ ఫీజు మాత్రమే ప్రామాణికం కాదు. సదరు అడ్వైజరు నిబద్ధతను కూడా అంచనా వేసుకున్న తర్వాతే ఎంపిక చేసుకోవాలి.
 
అంతా ఒకే దాంట్లో..
 
తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేస్తుందన్న అత్యాశతో మొత్తం డబ్బంతా తీసుకెళ్లి.. ఏ సాధనం అయితే బూమ్‌లో ఉందో అందులో పెట్టేస్తుంటాం. షేర్లలో రిస్కు ఎక్కువగా ఉంటుందని బ్యాంకు ఎఫ్‌డీలనో, సురక్షితంగా ఉంటుంది.. ఏదో రోజు భారీగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పూర్తిగా రియల్ ఎస్టేట్‌నో పట్టుకుని కూర్చుంటే లాభం లేదని ఇటీవలి పరిణామాలు చెబుతూనే ఉన్నా యి. ఇలా ఒకేదాన్ని నమ్ముకుంటేనే రిస్కు కాస్త ఎక్కువ ఉంటుం ది. కాబట్టి  మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏయే సాధనాలు మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయో చూసుకుని వాటిల్లో సముచితంగా కేటాయింపులు జరపడం మంచిది.
 
నేల విడిచి సాము చేయొద్దు..
 
ఉదయం నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల డ్యూటీ చేయడమే ఒకోసారి కష్టంగా అనిపిస్తుంది.. అలాంటిది ఆదాయాలపై సరైన అంచనాలు లేకపోతే ఏకంగా పదిహేను.. ఇరవై ఏళ్లపాటు ఇంటికోసం తీసుకున్న రుణభారాన్ని మేనేజ్ చేయడం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి భవిష్యత్‌లో ఆదాయాన్ని మరీ ఎక్కువగానో మరీ తక్కువగానో అంచనా వేసుకోవద్దు. అధిక అంచనాలంటే.. జీతాలు భారీగా పెరిగిపోతాయని లెక్కలేసేసుకుని, వాటిని అందుకోవడానికి ముందే అధిక రేట్లకు ఇల్లు, కారు, ఇతర లోన్లు అంటూ తీసేసుకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఏది నిజంగా అవసరమో ఏది అనవసరమో కాస్త ఆలోచించి కేటాయించాలి. అలాగని, ఏ క్షణంలో ఆదాయం పోతుందో అన్న భయంతో చిన్న చిన్న సరదాలు కూడా పక్కన పెట్టేయాలని కాదు. పొదుపు చేయడమే కాదు సరదాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడో జరిగే రిటైర్మెంట్ కోసం దాచి పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ప్రస్తుతం అప్పుడప్పుడు సరదా టూర్లు వేయడం కూడా అంతే ముఖ్యం. అయితే, దీని వల్ల పొదుపునకు భంగం కలుగుతోంది అనుకుంటే టూర్‌లో అనవసర ఖర్చులు కొంత తగ్గించుకుంటే సరి. కొంత ప్లానింగ్‌తో ఉంటే.. ఏదైనా మేనేజ్ చేసేయొచ్చు.
 
చివరిగా.. పొదుపు చేయడానికైనా, మదుపు చేయడానికైనా డబ్బు చేతిలో ఉండాలంటే.. ముందు దేనిపై ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, వాటి వల్ల మనకు ఒరిగే ప్రయోజనాలేమిటి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పటిష్టమైన ప్రణాళికను వేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. ముందు పొదుపు ఆ తర్వాతే ఖర్చు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతేనేం.. భయంకరమైన లెక్కలే సేసుకుని తలపోటు తెచ్చేసుకోకుండా.. సాధ్యమైనంత సింపుల్ ప్రణాళికను వేసుకుని, దానికి కట్టుబడి ఉంటే ఆర్థికంగా ఆల్ హ్యాపీసే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement