మంచివాళ్లనుకున్న అబ్బాయిలు
మంచి స్కూళ్లలోని అబ్బాయిలు
మంచి కుటుంబాల అబ్బాయిలు
ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం.
మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది.
టీనేజ్‌లో ఉన్న అమ్మాయి
వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి
వేల లైక్స్ ఉండే అమ్మాయి
బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి
గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి
ఏడుస్తోంది.
అబ్బాయిలూ.. ఆలోచించండి.
ఏడిపించడం ఫన్ అవుతుందా?!
‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది.
‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి.
ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు.
∙∙
ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్‌లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్‌మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు.
నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్‌స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు.
∙∙
మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్‌లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్‌లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్‌మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు.
లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు!
∙∙
తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు!
దుర్గంధం
ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి.
– నటి సోనమ్ కపూర్
ఇంత విషమా!
ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి.
– నటి స్వరా భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment