అనుక్షణం ఉత్సాహంతో ఉరకలెత్తేవాడే కార్యసాధకుడు
కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఎక్కడెక్కడ రాముడు శోకానికి గురయ్యే సన్నివేశం వస్తుందో అక్కడక్కడ వాల్మీకి మహర్షి అద్భుతమైన శ్లోకాలను మనకు అందించారు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వశుడైపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది.
శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే... ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు అనిర్వేదోశ్రీయం మూలం, అనిర్వేదపరం సుఖం, అనిర్వేదోహి సతతం, సర్వార్థేషు ప్రవర్తకః ’’ - (నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించకూడదు.) అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు.
ఇద్దరు ఖైదీలు జైలు ఊచల నుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో కూడా ఆశావాదిగా ఉండాలి. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే.. ‘‘నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వారు నిరాశావాదానికి గురయ్యారా? లేదే!
గాంధీగారు ముందు నడిచివెడుతుంటే అందరూ వెనక నడిచేవారు. ఒకసారి పొట్టి శ్రీరాములుగారు ముందు నడుస్తుంటే.. వెనకన ఉన్న వాళ్ళు అడ్డొచ్చి ‘‘గాంధీగారికంటే ముందు నడుస్తావేంటి, వెనకకురా’’ అన్నారు. గాంధీగారు కల్పించుకుని ‘‘శ్రీరాములు మిగిలిన వాళ్ళలాకాదు, నియమబద్ధమైన జీవితం గడుపుతున్నవాడు. నా కోసమే బతుకుతున్నవాడు. ముందు నడవనీయండి’’ అన్నారు. గాంధీగారు ఏం చెప్పారో దానికోసమే బతికిన శ్రీరాములు గారు చివరకు శరీరత్యాగానికి కూడా వెనకాడలేదు.
అంతటి మహానుభావులు వారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వెళ్ళి - ‘‘మిమ్మల్ని జగద్గురు అని సంబోధించాలనుకుంటున్నాం, అలా పిలవవచ్చా?’’ అని విన్నవించుకున్నారు. దానికి ఆయన ‘‘నిరభ్యంతరంగా పిలవవచ్చు.
నేను జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే. జగద్గురు అన్నది బహువ్రీహి సమాసం. జగత్తు అంతా గురువుగా కలిగినవాడు - అని కూడా అర్థం. నేను జగత్తుకు గురువును కాదు, ఈ జగత్తు అంతా నాకు గురువు కాబట్టి నేను జగద్గురువునే ’’
అన్నారు. ఇదీ విద్యా దదాతి వినయం అంటే!
నేను ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రం చేత విర్రవీగితే నా అంత అహంకారి ఇంకొకడు ఉండడు. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నేను సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. తనకు అన్నీ వచ్చు అని కాదు, రానివెన్నో అనుకోవడం గొప్ప. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాళ్ళు కూడా నాకేమి వచ్చు అని ఆగిపోయారు. ఎందువల్ల ? పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్ని రకాల నేలల గురించి చదివాను. ఎన్నో రకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో’’ అంటాడు.
చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఎంత చదువుకున్నా సంస్కారంలేని నాడు, ఆ చదువు పదిమందికి పనికొచ్చేది కాదు. తన తండ్రి ఎటువంటి కష్టాల్లోంచి వచ్చాడో తెలుసుకోవడానికి, చెప్పడానికి సిగ్గుపడే కొడుకు కొడుకే కాదు. తాను ఎన్ని కష్టాలుపడ్డాడో చెప్పుకోవడానికి నామోషీ పడే వ్యక్తి శీలవంతుడు కానే కాదు. నీవు ఎక్కడపుట్టావు, ఎక్కడ పెరిగావు... ఇవి కావు. నీవు దేనిగా మారావు, ఏయే గుణాలు సంతరించుకున్నావు. ఉత్థానపతనాలకు ఎలా ఎదురొడ్డి నిలిచావు, ఎవరు నీకు ఆదర్శం వంటి విషయాలు నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి.
వెయిటింగ్ లిస్ట్‌లో నీకు సీటు ఖరారుకాకపోతే, ఒక రాత్రి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవలసివస్తే... అయ్యబాబోయ్, నావల్లకాదు అని దిగిపోయినవాడు జీవితంలో మంచి సాధకుడు కాలేడు. అలా దిగిపోకుండా వెళ్ళగలిగినవాడికి అంత ధైర్యం ఎలా వస్తుందంటే... మహాత్ముల జీవితాల నుంచి నేర్చుకున్న పాఠాలతో!