నేనున్నాను నేనుంటాను | Cancer Day programs activate the world | Sakshi
Sakshi News home page

నేనున్నాను నేనుంటాను

Published Mon, Feb 4 2019 12:01 AM | Last Updated on Mon, Feb 4 2019 12:01 AM

Cancer Day programs activate the world - Sakshi

‘అయామ్‌.. ఐ విల్‌’. ఇదీ ఈ ఏడాది వరల్డ్‌ క్యాన్సర్‌ డే నినాదం. మరో రెండేళ్ల పాటు ఇదే నినాదంతో క్యాన్సర్‌ డే కార్యక్రమాలు ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తాయి. అయితే యు.ఎస్‌.లో ఉంటున్న రాజ్యలక్ష్మి దంపతులు గత ఐదేళ్లుగా ఇదే నినాదంతో.. ‘నేనున్నాను.. నేనుంటాను’ అంటూ క్యాన్సర్‌ పేషెంట్‌లకు భరోసా ఇవ్వడంతో పాటుఆర్థికంగా తోడ్పాటునిస్తున్నారు. 

‘‘మేడమ్‌! మెడిసిన్స్‌ స్టాక్‌ తగ్గుతోంది. మరికొంత పంపిస్తారా’’ హోల్‌సేల్‌ డ్రగ్గిస్ట్‌ మాధవి నుంచి ఫోన్‌.‘‘అలాగే మాధవీ! ఈ నెల ఎక్కువ అవసరం పడ్డాయా? సరే, అరేంజ్‌ చేస్తాను’’ బదులిచ్చారు రాజ్యలక్ష్మి. వెంటనే మందుల తయారీ కంపెనీకి ఫోన్‌ చేసి తనకు కావాల్సిన మెడిసిన్స్‌ ఇండెంట్‌ చెప్పారామె. ఇంతలో మరో ఫోన్‌... డాక్టర్‌ నుంచి. ‘‘మేడమ్‌! ఈ నెల ఎక్కువ మందిని రిఫర్‌ చేశాను. అంత అవసరం ఏర్పడింది.’’‘‘ఫర్వాలేదు డాక్టర్‌ గారూ, ఎంతమంది వచ్చినా పంపించండి’’ భరోసా ఇచ్చారు రాజ్యలక్ష్మి.‘‘అంతకు ముందు మందులు కొనుక్కోలేని పేషెంట్‌లను చూసి ఓ క్షణం బాధపడి, తర్వాత మర్చిపోయేవాళ్లం. ఇప్పుడు పేషెంట్లకు ధైర్యం చెప్పి మీరు అరేంజ్‌ చేసిన డీలర్‌ దగ్గరకు పంపిస్తున్నాం.

ఇది మీతో ప్రతిసారీ చెప్తున్న మాటే అయినా మళ్లీ మళ్లీ చెప్పాలనిపిస్తోంది. మందులు సబ్సిడీ ధరల్లో దొరుకుతాయని చెప్పినప్పుడు, అసలే కొనలేని వాళ్లకు ఉచితంగా ఇస్తారని చెప్పినప్పుడు పేషెంట్‌ కళ్లలో కనిపించే సంతోషం ఇంత అని మాటల్లో చెప్పలేను. వ్యాధి నయం అయినట్లే రిలీఫ్‌ పొందుతుంటారు. వాళ్లందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు’’ అన్నారు ఆ డాక్టర్‌.‘‘చేస్తున్నది నేను కాదు డాక్టర్‌ గారూ, ఆ భగవానుడే నా చేత చేయిస్తున్నాడు. సేవ అవసరం నాకు తెలియడానికే నాకు వ్యాధిని ఇచ్చి, వ్యాధిని తగ్గించి, మళ్లీ జీవితాన్నిచ్చినట్లున్నాడు.

ఇకపై ఈ జీవితం అభాగ్యుల సేవకోసమే. నాకొక్కదానికే ఈ బాధ తెలిస్తే చాలదనుకున్నాడేమో ఆ భగవంతుడు. నాతో పాటు, నా భర్తనూ క్యాన్సర్‌ బారిన పడేసి, తిరిగి మమ్మల్ని మామూలు మనుషులను చేశాడు. ఖరీదైన క్యాన్సర్‌ మందులు కొనుక్కోలేని వాళ్లకు సహాయం చేయడానికి డబ్బును కూడా ఆ భగవంతుడే సమకూర్చాడు. ఆ భగవంతుడిచ్చిన డబ్బును అవసరమైన వాళ్లకు చేరుస్తున్న చేతులు మాత్రమే ఇవి’’ అన్నారు రాజ్యలక్ష్మి మృదువుగా. నిజమే.. ఆమె ఎప్పుడూ తాను సహాయం చేస్తున్నానని చెప్పరు. తాను నమ్మే భగవానుడే చేయిస్తున్నాడంటారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే (గివింగ్‌ బ్యాక్‌ టు సొసైటీ) సంకల్పం తనలో కలగడం కూడా ఆ భగవానుని ప్రేరణేనంటారామె. 

‘మణీస్‌ కేఫ్‌’ వాళ్లమ్మాయి
రాజ్యలక్ష్మి ప్లాంజెరీ పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో. అప్పట్లో ప్రసిద్ధి చెందిన మణీస్‌ కేఫ్‌ వాళ్లమ్మాయి. తమిళనాడు నుంచి వచ్చి కావలిలో స్థిరపడిన తమిళ కుటుంబం వారిది. కావలిలో న్యాయవాదిగా కెరీర్‌ మొదలు పెట్టిన రాజ్యలక్ష్మికి నెల్లూరు కోమల విలాస్‌ వాళ్లబ్బాయి శంకర్‌నారాయణతో వివాహమైంది. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు వాళ్లు. ఆమె హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు కూడా. భర్తకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె ప్రయాణానికి గమ్యం కూడా అమెరికానే అయింది. ప్లాంజెరీ అనేది తమిళనాడులో శంకర్‌నారాయణ పూర్వికుల గ్రామం. ఆ ఊరి పేరే ఇంటిపేరుగా అమెరికాలో స్థిరపడ్డారు వాళ్లు. ఆ సంగతులను యు.ఎస్‌.నుంచి ‘సాక్షి’తో పంచుకున్నారు రాజ్యలక్ష్మి ప్లాంజెరీ.

డాలర్‌ ఆరు రూపాయల కాలం
‘‘మేము అమెరికా వెళ్లినప్పుడు ఒక డాలర్‌ ఆరు రూపాయలు. జీవించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి మా వారి జీతం సరిపోయేది. మాకు తొలిబిడ్డ అమ్మాయి. ఇంటి వెలుగు అని మురిసిపోయేలోపు పిడుగులాంటి నిజం. పాపాయి స్పెషల్లీ చాలెంజ్‌డ్‌ చైల్డ్‌! వైద్యం చేయించడానికి జీతం సరిపోయేది కాదు. బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఎనిమిదేళ్లపాటు పోరాటం చేశాం. మన బంధం ఇంతటితో తీరిపోయిందని చెప్పకుండానే మమ్మల్ని విడిచివెళ్లిపోయింది శారద (పాపాయి పేరు). ఆ ఇంట్లో ఉండబుద్ధయ్యేది కాదు. ఎటైనా వెళ్లిపోవాలనిపించేది. తర్వాత పుట్టిన బాబు పనుల్లో మునిగిపోతున్నా కూడా నాకు పాప గుర్తుకొస్తుండేది.

‘మీ డెస్టినేషన్‌ ఇది’ అని మా వారికి కొరియాలో ఉద్యోగం చూపించాడు భగవంతుడు. కొరియాకు వెళ్లిన తర్వాత కూడా నేను మామూలు మనిషి కాలేకపోయాను. ఊహలకు తప్ప మాటలకు లేని పాపాయి తరచూ గుర్తుకు వస్తుండేది. కొరియాలో సత్య సాయిబాబా స్పిరిచ్యువల్‌ గ్యాదరింగ్స్‌ జరిగేవి. ఇండియన్స్‌ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి పట్టుకుని మరీ ఆహ్వానించేవాళ్లు. ఆధ్యాత్మిక సత్సంగాల్లో సాంత్వన దొరికింది. ఆ సత్సంగాలు మా జీవిత గమనాన్నే మార్చేశాయి.

సత్యసాయి రప్పించారు
యు.ఎస్‌.నుంచి ఏటా సాయిబాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చేవాళ్లం. ఓసారి బాబా మా వారితో ‘ఇప్పటి వరకు సమాజం నుంచి తీసుకున్నావు. ఇక సమాజానికి చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ నువ్వు చేయాల్సిందంతా పూర్తి చేయి’ అన్నారు. ఆ మాటతో అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చాం. సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలైంది. మొదటగా ఇచ్చింది ప్రభుత్వానికే. ఎన్‌ఆర్‌ఐకి ఇచ్చే టాక్స్‌ మినహాయింపును తీసుకోకుండా పూర్తి ట్యాక్స్‌ కట్టారాయన.

అమెరికాలో ఆయన చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌తో ఆదుకున్న ఐవోడబ్లు్యఎ యూనివర్సిటీలో ఏటా మూడు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాం. మా పాపకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్, ట్రైనింగ్‌ ఇప్పించడానికి అప్పట్లో మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. యుఎస్‌లోని రే గ్రాహమ్‌ అసోసియేషన్‌ మాకు హెల్ప్‌ చేసింది. ఆ చారిటీకి మా పాప శారదాదేవి పేరుతో ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ ఇస్తున్నాం. శారద మెమోరియల్‌తో స్పెషల్లీ చాలెంజ్‌డ్‌ కిడ్స్‌కి అవసరమైన సర్వీస్‌ ఇస్తూ ఉంటే శారద మాకు లేదని అనిపించదు.

అప్పటికే ఫోర్త్‌ స్టేజ్‌!
ఆ భగవంతుడు మా చేత... విద్యకు, స్పెషల్‌ కిడ్స్‌కే కాదు, వైద్యరంగానికీ సేవ చేయించాలనుకున్నాడో ఏమో తెలియదు. మా భార్యాభర్తలిద్దరినీ మూడు నెలల తేడాతో క్యాన్సర్‌ బారిన పడేశాడు, ఆనక బతికించాడు. 2011లో మా అబ్బాయికి పెళ్లి చేశాం. ‘అరవై నిండాయి, బాధ్యతల నుంచి రిటైరయ్యాం’ అనుకునే లోపు ఆ ఏడాది ఆగస్టులో నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బయటపడింది. అప్పటికే ఫోర్త్‌ స్టేజ్‌. మూడు నెలలే అన్నారు డాక్టర్లు. నాకు వైద్యం మొదలైంది. ఆ ఏడాది డిసెంబర్‌లో మా వారికి స్టమక్‌ క్యాన్సర్‌ బయటపడింది. ఇద్దరమూ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాం. నాకు మందులతోనే తగ్గిపోయింది. ఇద్దరం కోలుకున్న తర్వాత క్యాన్సర్‌ నివారణకు ప్రివెంటివ్‌ మెడిసిన్‌ రీసెర్చ్‌కి మావంతుగా తిరిగి ఇవ్వాలనిపించింది. 

హ్యూస్టన్‌లోని ఎండిఎ రీసెర్చ్‌కి, ఆరిజోనాలోని ఫీనిక్స్‌ నగరంలో హోమియో మెడిసిన్‌ పరిశోధనలు, క్లినికల్‌ ట్రయల్స్‌కి  మా వంతు సాయం చేస్తున్నాం. ఇండియాలో నేరుగా పేషెంట్‌కే సహాయం చేస్తున్నాం. ఏడాదిలో సగం కాలం అమెరికాలో ఉంటాం. అందుకే క్యాన్సర్‌ హాస్పిటల్‌ డాక్టర్లను కలిసి మేము చేయదలుచుకున్నది చెప్పాం. మాధవి అనే హోల్‌సేల్‌ డీలర్‌తో అనుసంధానం అయ్యాం. ఎనభై వేలు, లక్ష రూపాయలు ఉండే ఇంజక్షన్‌లను వేయించుకోలేని వాళ్లకు మేము ఆసరా అవుతున్నాం.

పేషెంట్లు వాళ్లు భరించగలిగినంత ఖర్చును వాళ్లు భరిస్తారు, మిగిలిన డబ్బు మేమిస్తాం. ఒక్కొక్కరు నలభై వేలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఐదు–పది వేలకు మించి భరించలేమంటారు. అసలే ఆధారమూ లేని వాళ్లకు ఫ్రీగా ఇస్తున్నాం. తల్లిగా, గృహిణిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. ఇప్పుడు సోషల్‌ వర్క్‌లో ఉన్న సంతృప్తిని ఆస్వాదిస్తున్నాను. ఈ జీవితం ఇక సమాజానికి తిరిగి ఇవ్వడానికే. ఏటా ఇంత మొత్తం చదువులకు, ఇంత మొత్తం వైద్యానికి, ఇంత మొత్తం స్పెషల్‌ కిడ్స్‌కి, ఇంత మా ఇద్దరి మెయింటెనెన్స్‌కి అని విభజించుకుని ఖర్చు చేస్తున్నాం. మా అబ్బాయి ఇక్కడే అమెరికాలో తన ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మేము సంపాదించుకున్నదంతా ఇక సమాజసేవకే అంకితం’’ అన్నారు రాజ్యలక్ష్మి.
– వాకా మంజులారెడ్డి

భయం వద్దు.. ధైర్యం పెంచుకోవాలి
నాకు సర్జరీ చేయాల్సిందేనన్నారు డాక్టర్లు. అయితే దేవుడి రూపంలో డాక్టర్‌ సెంథిల్‌ ‘మందులతో తగ్గుతుందేమో ప్రయత్నం చేద్దాం’ అన్నారు. మందులు వేసుకుంటూ రోజూ ప్రాణాయామం చేశాను. పచ్చటి చెట్టు కింద కూర్చుని ఉదయం పది నిమిషాలు, మధ్యాహ్నం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు ప్రాణాయామం చేస్తే తగినంత ఆక్సిజెన్‌ అందుతుంది. దేహం తనను తానే తిరిగి ఆరోగ్యవంతం చేసుకుంటుంది.

ఒంటికి రోజూ సూర్యరశ్మి తగలాలి. జీవనశైలిని ఆక్సిజెన్‌ రిచ్‌గా ఉండేలా చూసుకోవాలి. వైఫై ఎన్విరాన్‌మెంట్‌ను తగ్గించుకోవాలి. ముఖ్యంగా బిడ్డల్ని కనాల్సిన వయసులో ఉన్న అమ్మాయిలు మంచి ఆహారం, మంచి గాలిలో జీవించాలి. చేతిలో ఆరోగ్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత ఆరోగ్యం కోసం వెంపర్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దనేది నా సూచన. ఇక క్యాన్సర్‌ బారిన పడిన వాళ్లకు చెప్పే మాట ఒకటే.. ఇప్పుడు మంచి మందులున్నాయి. క్యాన్సర్‌ ప్రాణాంతకం కాదు. ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషిగా మనం చేయాల్సింది. నేను భగవంతుడిలో ధైర్యాన్ని వెతుక్కున్నాను.

వేద పఠనం ఓ శక్తి తరంగం 
మోడరన్‌ లైఫ్‌స్టయిల్‌లో క్యాన్సర్‌ 35 ఏళ్లకే దాడి చేస్తోంది. బయట నూనెలో వేయించిన ఆహారం, సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ చాలా ప్రమాదకరం. మాది చాలా డిసిప్లిన్డ్‌ లైఫ్‌స్టయిలే అయినా, హైదరాబాద్, శ్రీనగర్‌ కాలనీలో మా ఇంటి దగ్గరలో ఉన్న సెల్‌ టవర్లే క్యాన్సర్‌ బారిన పడేశాయి. వేదం, రుద్రం, పంచసూక్త పఠనం చేస్తాను. ఆ వైబ్రేషన్స్‌ ఒట్టి శబ్ద తరంగాలు కాదు, శక్తి తరంగాలు. మనిషిని ఆరోగ్యవంతం చేస్తాయి.  మామూలు వ్యక్తుల్లాగే అన్ని పనులూ చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. 
– శంకర్‌నారాయణ ప్లాంజెరీ, 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement