
వంట సులువుగా పూర్తి చేయడమే కాకుండా, శుభ్రం చేయడానికి కూడా తేలికగా ఉండటంతో ఇటీవలి కాలంలో నాన్‌స్టిక్ పాత్రల వాడుక బాగా పెరిగింది. అయితే, వీటితో కేన్సర్ ముప్పు పొంచి ఉందని అమెరికన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్‌స్టిక్ పాత్రల తయారీలో వాడే రసాయనాలు ఆహార పదార్థాల్లో కలిసిపోయి, అవి కేన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయని వాషింగ్టన్‌లోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.
నాన్‌స్టిక్ పాత్రల్లోని ‘పీఎఫ్‌ఓఏ’, బిస్‌ఫెనాల్–ఏ (బీపీఏ) రసాయనాలకు కేన్సర్ కలిగించే లక్షణం ఉందని, నాన్‌స్టిక్ పాత్రల్లో వండే పదార్థాల్లో పీఎఫ్‌ఓఏ, బీపీఏ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నాయని తమ పరిశీలనలో తేలినట్లు వారు వెల్లడించారు. ఈ రసాయనాల ప్రభావం వల్ల కేన్సర్‌తో పాటు ఆటిజం, స్థూలకాయం, ఏడీహెచ్‌డీ, టైప్–2 డయాబెటిస్, థైరాయిడ్ గ్రంథి పనితీరులో అవాంఛితమైన మార్పులు, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వాషింగ్టన్ నిపుణులు వివరిస్తున్నారు.